
రెండో విడత ర్యాండమైజేషన్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్, అధికారులు
కామారెడ్డి క్రైం: పోలింగ్ విధులు నిర్వహించే అధికా రుల రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ పారదర్శకంగా పూర్తయ్యిందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ హాల్‌లో మంగళవారం పోలింగ్ విధులు నిర్వహించే ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్, ఇతర పోలింగ్ సిబ్బందికి సంబంధించిన ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించా రు. ఎన్నికల సాధారణ పరిశీలకులు ఆర్థూర్ వర్చూయీయో, జగదీషల సమక్షంలో ఈ ప్రక్రియ సాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 913 పోలింగ్ కేంద్రాలకుగాను ఎన్నికల కమిషన్ రూపొందించిన ఆన్‌లైన్ సాఫ్ట్‌వేర్ ద్వారా 913 బృందాలను కేటాయించామన్నారు. అదనంగా 20 శాతం బృందాలను సిద్ధంగా ఉంచుతున్నామన్నారు. దివ్యాంగుల కోసం ఏర్పాటు చేస్తున్న పోలింగ్ కేంద్రాలకు మాత్రం సిబ్బందిని మ్యానువల్‌గా కేటాయిస్తున్నామన్నారు. ప్రతి పోలింగ్ బృందంలో ఒక మహిళా అధికారి తప్పనిసరిగా ఉంటారన్నారు. నియోజకవర్గం వారీగా పోలింగ్ సిబ్బంది వివరాలను పరిశీలకులకు అందజేశారు. బృందాలకు ఈనెల 21 నుంచి 23 వ తేదీ వరకు సంబంధిత నియోజకవర్గాలలో ఓటింగ్ యంత్రాల వినియోగం, నిర్వహణ, మాక్ పోలింగ్ తదితర అంశాలపై రెండో విడత శిక్షణ ఇస్తామన్నారు. ఈనెల 24 న కలెక్టరేట్‌లో మైక్రో అబ్జర్వర్స్‌కు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నోడల్ అధికారులు రాజారాం, రఘునందన్, ఎన్‌ఐసీ నెట్‌వర్క్ ఫీల్డ్ ఇంజినీర్ శ్రీకాంత్, ఈడీఎం ప్రవీణ్ కుమార్, కలెక్టరేట్ ఏవో మసూర్ అహ్మద్ పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి పాటిల్
పూర్తయిన రెండో విడత ప్రక్రియ