● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ పేరిట డ్రామా
● బాబు కుటిల యత్నాలకు కోర్టు మొట్టికాయలు
● గతంలో న్యాయస్థానం నిరాకరించినా పదవులిచ్చిన వైఎస్ జగన్
● బాబు బురిడీపై మండిపడుతున్న బీసీ సంఘాల నేతలు
సాధ్యంకాదని తెలిసీ నాటకాలు
బీసీలకు 34 శాతం రిజర్వేషన్ సాధ్యంకాదని తెలిసీ చంద్రబాబు నాటకాలాడారు. కేవలం బీసీలను మభ్యపెట్టి, మోసం చేసేందుకు చేసిన ప్రయత్నమే ఇది. నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే చట్టం తీసుకురావచ్చు కదా? బీసీలు రాణించడం చంద్రబాబుకు ఇష్టం ఉండదు. కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వినియోగిస్తున్నారు. బాబు పాలనలో బీసీలపై దాడులు జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు? అనేక మంది బీసీ నేతలను వేధింపులకు గురి చేయడాన్ని బట్టి చూస్తే బీసీలపై చంద్రబాబుకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. అన్ని పదవుల్లోనూ అగ్రతాంబూలం ఇచ్చారు.
– నవుడు వెంకటరమణ,
వైఎస్సార్ సీపీ రాష్ట్ర బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్
చిత్తశుద్ధి లేదు..
స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలు కేవలం బీసీలను మభ్యపెట్టేందుకే. చంద్రబాబు బీసీలకు రిజర్వేషన్ కల్పనపై చిత్తశుద్ధి లేదు. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో 34 శాతం బీసీ రిజర్వేషన్లపై న్యాయపరమైన అభ్యంతరాలు వచ్చిన విషయం తెలిసి కూడా, వాటిని అధిగమించేలా బలమైన చట్టపరమైన, గణాంక ఆధారాలను సిద్ధం చేయకుండా మళ్లీ అదే విధంగా జీఓలు తీసుకురావడం వెనుక ఉద్దేశమేమిటి?
– ఒమ్మి రఘురామ్,
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: బాబు రిజర్వేషాలకు న్యాయస్థానంలో చుక్కెదురైంది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ఆడుతున్న రాజకీయ క్రీడలు, మోసపూరిత డ్రామాలు హైకోర్టు తీర్పుతో బట్టబయలయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ తెచ్చిన జీఓలను ఏపీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ జీవోలు చెల్లవని స్పష్టం చేసింది. ఈ పరిణామం బీసీ సంఘాల్లో ఆగ్రహావేశాలు నింపుతోంది. కేవలం ఓట్ల కోసం బీసీలను మోసం చేయాలని చంద్రబాబు భావించడంపై భగ్గుమంటున్నాయి. స్థానిక ఎన్నికల్లో బాబుకు బీసీల సత్తా చూపుతామంటూ గొంతెత్తి చాటుతున్నాయి.
చట్టం చేయకుండానే...
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన చంద్రబాబు. అందుకనుగుణంగా చట్టం చేయాల్సి ఉన్నా.. అదేమీ పట్టించుకున్న పాపానపోలేదు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ బీసీలను మరోసారి మోసం చేసేందుకు కేవలం జీఓలతో కుటిలనీతికి పాల్పడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుప్రీం మార్గదర్శకాలకు అనుగుణంగా చట్టబద్దం చేయాల్సిన బాబు.. డెడికేషన్ కమిషన్ ఏర్పాటు పేరుతో మరో నాటకానికి పాల్పడ్డారు. ఆ కమిటీ నివేదిక ఇవ్వకముందే జీఓలు జారీ చేయడం ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని చెబుతూ మరో నాటకానికి తెర తీశారు. ఇది ప్రజలను మరోసారి మభ్య పెట్టేందుకే అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో వ్యతిరేకించి
స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి 2019లో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం జీఓ 176 జారీ చేసి, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు సిద్ధమైంది. అప్పట్లో చంద్రబాబు తన పార్టీ నాయకుడు, అంతకు ముందు తన ప్రభుత్వంలో ఏపీ స్టేట్ ఎంపాయిమెంట్ గ్యారెంటీ కౌన్సిల్ (ఏపీఎస్‌ఈజీసీ) సభ్యుడిగా ఉన్న వ్యక్తితో హైకోర్టు, సుప్రీంకోర్టులోనూ దీనికి వ్యతిరేకంగా కేసులు వేయించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదన్న ఆదేశాలతో బీసీ రిజర్వేషన్లు కొట్టేస్తున్నామని హైకోర్టు అప్పట్లో తీర్పు చెప్పింది. ఇవన్నీ తెలిసినా మరోసారి మహా డ్రామాకు చంద్రబాబునాయుడు తెరలేపడంపై బీసీ వర్గాలు భగ్గమంటున్నాయి.
బీసీలను మభ్యపెట్టే ఎత్తుగడ
స్థానిక ఎన్నికల్లో బీసీల ఓట్లను కాజేసేందుకు రిజర్వేషన్ అంటూ టీడీపీ బూటకపు జీవోను ప్రవేశపెట్టింది. ఇది సాధ్యం కాదని తెలిసినా బీసీలను పక్కదోవ పట్టించేందుకు మరో అబద్ధానికి చంద్రబాబు తెరతీశారు. చంద్రబాబు బీసీలను ఎప్పుగానే ఓటు బ్యాంకు గానే ఉపయోగించుకుంటున్నారు.
–పెంటకోట నాగబాబు,
బీసీ నాయకుడు, కిర్లంపూడి
వెన్నుపోటు పార్టీకి చెంపపెట్టు
హైకోర్టు తీర్పుతో వెన్నుపోటు పార్టీ నాయకుడు చంద్రబాబు నిజ స్వరూపం బట్టబయలైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు గొప్పగా రిలీజ్ చేసిన రెండు జీవోలు 105, 1065లను కొట్టి వేస్తూ హైకోర్టు తీర్పు చెప్పడం వెన్నుపోటు పార్టీకి చెంపపెట్టు. ఆది నుంచీ బాబుకు బీసీలంటే చిన్న చూపు. బీసీ రిజర్వేషన్లపై నియమించిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదిక ఇంకా పరిశీలనలో ఉందని కోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం 34 శాతం రిజర్వేషన్లు అమలుకు సిద్ధపడటం బీసీలను మోసం చేయటమే. ఇప్పటికై నా చిత్తశుద్ధి ఉంటే 50 శాతం పరిమితిని ఎత్తివేస్తూ రాజ్యాంగ సవరణ చేసేలా కేంద్రంలోని కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి.
– అల్లి రాజబాబు, వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు
బాబు కుటిల డ్రామాలు
బీసీల రిజర్వేషన్ చెల్లదని తెలిసినా చంద్రబాబు డ్రామా ఆడడానికి 34 శాతం రిజర్వేషన్లు పెంచుతూ జీఓ జారీ చేశారు. గతంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో బీసీలకు రిజర్వేషన్ పెంచాలని భావిస్తే చంద్రబాబు వెనుక ఉండి కోర్టులో వ్యతిరేకంగా కేసు వేయించారు. ప్రస్తుతం బీసీల మద్దతు పొందొచ్చని కుటిలయత్నంతో జీఓ డ్రామాలు అడుతున్నారు. బీసీలు ఇప్పటికై నా కళ్లు తెరవాల్సిన అవసరం ఉంది.
– రెడ్డి శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ బీసీ
విభాగం పట్టణ సంఘ అధ్యక్షుడు, సామర్లకోట
బీసీల పక్షపాతిగా వైఎస్సార్ సీపీ
బీసీల అభ్యున్నతి విషయంలో చిత్తశుద్ధితో కృషి చేసింది వైఎస్సార్ సీపీనే. బీసీ రిజర్వేషన్‌ను కోర్టులు కొట్టేసినా.. బీసీలకు ఆ మేరకు రాజకీయంగా ప్రోత్సాహం ఇవ్వాలన్న ఉద్దేశంతో వైఎస్ జగన్ స్వతహాగా 34 శాతం కంటే ఎక్కువగా ప్రాతినిధ్యం కల్పించారు. రాష్ట్ర క్యాబినెట్‌లో 25 మంది మంత్రులు ఉంటే అందులో 11 మంది బీసీలు, రాష్ట్ర కోటాలో భర్తీ అయిన 11 రాజ్యసభ సీట్లకు నలుగురు బీసీలను పంపించింది. చంద్రబాబు 2014–19 మధ్య ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదు. బీసీలకు చట్టసభల్లో 50 శాతం సీట్లు కేటాయించాలని కోరుతూ పార్లమెంటులో వైఎస్సార్ సీపీ ఎంపీలతో ప్రైవేట్ బిల్లును పెట్టించిన ఘనత వైఎస్సార్ సీపీకే దక్కుతుంది.


