కాకినాడ రూరల్: తెలీదు.. గుర్తులేదు.. మర్చిపోయాను.. రెండో విడత విచారణలోనూ నిందితుడు సాధిక్‌ఖాన్ ఇదే దాటవేట ధోరణిని అవలంబిస్తూ పోలీసులకు చుక్కలు చూపుతున్నట్టు తెలిసింది. కాకినాడ జిల్లా పిఠాపురం పీఆర్ ఏఈ టి.నూకరాజు కుటుంబం ఆత్మహత్య, అల్లుడు జగదీశ్వరరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు షేక్ సాధిక్ ఖాన్‌ను రెండో విడత విచారణ కోసం సర్పవరం పోలీసులు గురువారం అతన్ని తీసుకొచ్చారు. వివరాల్లోకి వెళితే... ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య, ఏఈ అల్లుడు జగదీశ్వరరెడ్డి మృతిపై ఆయన తండ్రి భాస్కరరెడ్డి ఫిర్యాదు మేరకు సర్పవరం పోలీస్‌స్టేషన్‌లో సాధిక్ ఖాన్‌పై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. సెప్టెంబరు 8, 9, 10 తేదీల్లో తొలి విడతగా పోలీసులు అతన్ని విచారించిన విషయం తెలిసిందే. అప్పట్లో దాదాపు 200 ప్రశ్నలతో కాకినాడ జిల్లా పోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో సర్పవరం సీఐ ప్రకాష్ విచారణ జరపడంతో పాటు సాధిక్‌కు చెందిన ప్రో షూటింగ్ అకాడమీకి తీసుకువెళ్ళి అక్కడ సీన్ రీ కన్‌స్ట్రక్షన్ నిర్వహించారు. అకాడమీలోని కీలక ఆధారాలు గల ల్యాప్‌టాప్, ఇతర డివైజ్‌లు, శిక్షణ కోసం వినియోగించే రైఫిళ్లను సీజ్ చేశారు. జగదీశ్వరరెడ్డి హత్య కేసుకు సంబంధించి నేరాన్ని మొదటిసారి విచారణలో సాధిక్ అంగీకరించాడు. ల్యాప్‌టాప్‌లోని కీలకమైన సమాచారంతో పాటు మొదటిసారి విచారణలోని పలు కీలక అంశాలపై గురువారం సమగ్ర విచారణను ప్రారంభించారు.
మొదటి రోజు విచారణ ఇలా...
స్పెషల్ మొబైల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి ఉషా లక్ష్మీకుమారి ఆదేశాల మేరకు సాధిక్ ఖాన్‌ను సర్పవరం పోలీసులు గురువారం కస్టడీకి తీసుకున్నారు. గురువారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సీసీ కెమెరాల పర్యవేక్షణలో వీఆర్వోలు, అడ్వకేట్ సమక్షంలో విచారణ చేపట్టారు. తొలి విడత కస్టడీలో 200 ప్రశ్నలకు గాను 118 వరకు సంధించి విచారించగా గురువారం సుమారు 25 ప్రశ్నలకు సాధిక్ నుంచి సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారు. అయితే సీసీ కెమెరాల పర్యవక్షణలో విచారణ జరుగుతుండడంతో సాధిక్ ఖాన్ మరోసారి సమాధానాల దాటవేట ధోరణి ప్రదర్శించి తెలియదు.. మరచిపోయాను.. గుర్తు లేదనే పల్లవిని ఎత్తుకున్నట్టు తెలిసింది. రైఫిల్ షూటింగ్ కోసం కుమారుడు కార్తికేయ రెడ్డిని సాధిక్ అకాడమీకి తీసుకువెళ్ళిన నూకరాజు కుమార్తె సౌజన్యను ఏ విధంగా ట్రాప్ చేశాడో, ఆమె భర్త జగదీశ్వరరెడ్డిని తొలుత ప్రొటీన్ పౌడర్, కొబ్బరి నీళ్ళ ద్వారా స్లో పాయిజన్‌గా రసాయనం అందించడం, హైదరాబాద్‌లో ఉండగా జగదీశ్వరరెడ్డి చనిపోయే ముందు రోజు జూలై ఒకటిన పొటాషియం సైనేడ్ ప్రయోగించడంపై పోలీసులు ప్రశ్నలు వేశారు. సౌజన్య పేరిట రావులపాలెంలో ఉన్న రూ.25 కోట్ల స్థలంతో పాటు ఆమెకు చెందిన బంగారం, నగదు, నూకరాజుకు చెందిన ఆస్తుల కోసం వేధింపులు, మతం మారితే పెళ్ళి చేసుకుంటానని ఒత్తిడి తేవడంపై పోలీసులు విచారణలో ప్రశ్నలు కురిపించారు. ముఖ్యంగా జగదీశ్వరరెడ్డికి సైనేడ్ అందించిన హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులను తొలి విడత కస్టడీలో విచారించగా.. వారు సైనేడ్ ఇచ్చిన విషయాన్ని అంగీకరించారు. ఆ సైనేడ్‌లో మిగిలింది ఎక్కడ ఉంది అని గురువారం ప్రధానంగా విచారించగా.. తాను సైనేడ్ వాడలేదని దాటవేతతో పాటు హైదరాబాద్‌లోనే పారవేసినట్టు పోలీసులకు సాధిక్ సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. ల్యాప్‌టాప్‌లో డేటా, ఫొటోల గురించి కూడా పోలీసులు విచారించారు. సౌజన్యపై మత మార్పిడి ఒత్తిడితో పాటు జగదీశ్వరరెడ్డిని ఎందుకు చంపాడనే అంశంపై కూడా పలు ప్రశ్నలు వేసినట్టు తెలిసింది. శుక్రవారం రెండోరోజు విచారణ అనంతరం శనివారం తిరిగి అతన్ని సెంట్రల్ జైలుకు తరలించనున్నారు.
పోలీసులను కలసిన కుటుంబ సభ్యులు
ఏఈ నూకరాజు సోదరి కృష్ణవేణి, జగదీశ్వరరెడ్డి చెల్లెలు కరుణ, ఇతర కుటుంబ సభ్యులు వేర్వేరుగా గురువారం సర్పవరం పోలీసులను కలిశారు. జగదీశ్వరరెడ్డికి చెందిన కార్లపై రూ.1.25 కోట్ల వరకు ఈఎంఐలు ఉండడంతో ఫోన్లకు సమాధానం చెప్పటేకపోతున్నామని, సీజ్ చేసిన వాటిని విడుదల చేయాలని కరుణ కోరారు. నూకరాజు రాసిన వీలునామా ప్రకారం నూకరాజు ఇంట్లో ఫర్నిచర్ తీసుకువెళ్ళేందుకు అనుమతి ఇవ్వాలని కృష్ణవేణి కోరినట్టు తెలిసింది. కోర్టు ద్వారానే వీటిని పొందాలని వారికి పోలీసులు సూచించినట్టు సమాచారం.
పోలీసుల విచారణలో సాధిక్‌ఖాన్
రెండోసారి విచారణకు
కస్టడీలోకి తీసుకున్న పోలీసులు
సీఐ ప్రకాష్ ఆధ్వర్యంలో తొలి రోజు రాత్రి వరకు విచారణ
ఏఈ నూకరాజు కుటుంబం
ఆత్మహత్య, అల్లుడి హత్యకేసులో
సాధిక్‌కు 25 ప్రశ్నలు
ఆ సైనేడ్ ఎక్కడ అని ప్రశ్నించగా..
పారవేశానని సమాధానం


