అమలాపురం రూరల్: యానాం నుంచి అక్రమంగా పెట్రోలు, డీజిల్ తెచ్చి జిల్లాలో విక్రయిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా పెట్రోల్ బంకుల అసోసియేషన్ సభ్యులు అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద గురువారం నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ వైఖోం నైదియాదేవికి ఫిర్యాదు చేశారు. అమలాపురంలో ఎత్తురోడ్డు వద్ద ఉన్న ఓ పెట్రోల్ బంకుకు చెందిన వ్యక్తి యానాం నుంచి అక్రమంగా చిన్న ట్యాంకర్ల ద్వారా పెట్రోల్ తెచ్చి దొంగ వ్యాపారం చేస్తూ, స్థానిక పెట్రోల్ బంకులకు నష్టం కలిగిస్తున్నాడంటూ వారు ఆరోపించారు. యానాం పెట్రోల్, డీజిల్ విక్రయంతో రాష్ట్ర ప్రభుత్వం పన్నులను కోల్పోతుందన్నారు. యానాం నుంచి డీజిల్ తెచ్చి లీటరుకు 13 తక్కువ ధరకు విక్రయిస్తున్న వ్యవహారంపై విచారణ చేయాలని కోరారు. కొన్నిచోట్ల సరైన మీటరింగ్ ఏర్పాట్లు లేకుండా, నేరుగా నాజిళ్ల ద్వారా ఇంధనాన్ని విక్రయిస్తున్నట్లు తెలిపారు. జిల్లా పెట్రోలియం డీలర్ల సంఘ అధ్యక్షుడు తిరుమలరావు, సెక్రటరీ జవ్వాది తాతబాబు, కోశాధికారి అనీల్‌కుమార్, డీలర్ల సంఘ నాయకులు శ్రీనివాస్ చౌదరి, విశ్వేశ్వరరావు, సుధీర్ రాజు, సురేష్‌శర్మ, సునీల్ కుమార్, దొరబాబు, రత్నాకర్, ప్రసాద్, చిట్టిబాబు, అంజిబాబు పాల్గొన్నారు.


