మృత్యువులోనూ వీడని స్నేహం | - | Sakshi
Sakshi News home page

మృత్యువులోనూ వీడని స్నేహం

Sep 28 2026 12:59 AM | Updated on Sep 28 2026 12:59 AM

● బెండపూడి రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

● యూట్యూబర్‌ రాజు, శివాజీగా గుర్తింపు

● వెనుక నుంచి ట్రాలీ లారీ ఢీకొని ప్రమాదం

అన్నవరం/శంఖవరం: వారిద్దరూ చిన్ననాటి స్నేహితులు. ఒకటే ఊరు. ఏం చేసినా ఇద్దరూ కలిసే చేసేవారు. ఎన్ని జన్మల స్నేహమో ఈ జన్మలోనూ జతగా వెళ్లిపోయారు. వివరాల్లోకి వెళితే.. బెండపూడి వద్ద జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో శంఖవరం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన పలివెల వెంకట జవహర్‌లాల్‌ కుమార్‌ రాజు (రాజు) (41), కర్రి శివ గణేష్‌ (శివాజీ) (41) మృతి చెందారు. రాత్రి 10.30 గంటల సమయంలో హైవేపై బైక్‌ మీద వెళ్తూ బెండపూడికి వెళ్లేందుకు కుడివైపునకు తరగ్గా అదే సమయంలో వెనుకనుంచి వస్తున్న ట్రాలీ లారీ వీరిని బలంగా ఢీకొనడంతో వారి తలలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. వారి బైక్‌ను లారీ కొంత దూరం లాక్కుపోయింది. ట్రాలీకి సపోర్టుగా అమర్చిన రాడ్లు రాజును రోడ్డు మీద లాక్కునిపోవడంతో అతడి శరీరం ఛిద్రమైంది. ఇద్దరి శరీరాల మీదుగా ట్రాలీ టైర్లు ఎక్కడం శరీరాలు నుజ్జయ్యాయి. రాజు ఆర్‌ఆర్‌ న్యూస్‌ యూట్యూబ్‌ ఛానల్‌ నడుపుతూ అనేక సామాజిక అంశాలపై వార్తలు ప్రసారం చేస్తూ గుర్తింపు పొందాడు. తొండంగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కొంతంగి కొత్తూరులో విషాదఛాయలు

మృతి చెందిన ప్రాణ స్నేహితులూ పలివల రాజా, కర్రి శివాజీ శంఖవరం మండలం కొంతంగి కొత్తూరు గ్రామానికి చెందిన వారు కావడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పలివల రాజా యూట్యూబ్‌ చానల్‌ రిపోర్టర్‌గా, శివాజీ సామాజిక సేవల్లో చురుగ్గా పాల్గొనేవాడని గ్రామస్తులు తెలిపారు. రాజా వివాహమై కుమార్తె, కుమారుడు ఉండగా, శివాజీకి కుమారుడు ఉన్నాడు. వారిద్దరి మృతితో ఆ రెండు కుటుంబాలూ రోడ్డునపడ్డాయి. వారి మృతితో వారిళ్ల వద్ద కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. వారిద్దరి కుటుంబాలను స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పరామర్శించి విచారం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement