తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు
తాళ్లపూడి: మండలం మలకపల్లి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఒక యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ఎస్సై టి.రామకృష్ణ తెలిపిన వివరాల మేరకు మలకపల్లికి చెందిన డ్రైవర్ బొబ్బరాడ శివప్రసాద్ (31)కు నాలుగేళ్ల క్రితం వివాహమైనప్పటికీ కుటుంబ కలహాలతో భార్య నుంచి విడిగా ఉంటున్నాడు. కొంత కాలంగా స్థానిక మహిళ ఆళ్ల జ్యోతి అతడితో తరచుగా ఫోన్‌లో మాట్లాడుతుండడంతో అతడి తల్లి ముత్యాలమ్మ మందలించేది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి 10 గంటల సమయంలో జ్యోతి ఫోన్ చేయగా అతడు తీయకపోవడంతో అతడి తల్లికి పలుమార్లు ఫోన్ చేసింది. ఆ సమయంలో శివప్రసాద్ తన తల్లితో జ్యోతి తనను తరచూ ఫోన్ చేసి ఇబ్బంది పెడుతోందని చెప్పాడు. అనంతరం కొద్దిసేపటికి తల్లీకొడుకు ఇద్దరూ ఇంటి బయట నిద్రించగా సుమారు 3 గంటల ప్రాంతంలో ఏదో పడినట్టు శబ్దం వచ్చి ముత్యాలమ్మ లేచి చూడగా జ్యోతి మాటలు వినిపించాయని, అక్కడ తన కుమారులు లేకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. ఉదయం 7 గంటల సమయంలో బంధువులతో పాటు వెదికించగా గ్రామ పంచాయతీ గోడ పక్కన ఉన్న మురుగు కాలువలో శివప్రసాద్ విగత జీవిగా పడి ఉన్నట్టు కనుగొన్నారు. తన కుమారుడి మృతిపై జ్యోతి, ఆమె కుటుంబ సభ్యుపై తనకు అనుమానం ఉందని ఫిర్యాదు చేసిన మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు. కొవ్వూరు డీఎస్పీ జి.దేవకుమార్, రూరల్ సీఐ కె.విజయబాబు పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేస్తున్నారు.


