● గోదావరి పొదల్లో
అపస్మారక స్థితిలో గుర్తింపు
● ప్రథమ చికిత్స అనంతరం
మెరుగైన చికిత్సకు రాజమహేంద్రవరం జీజీహెచ్‌కు తరలింపు
ఆత్రేయపురం: స్థానిక గౌతమి గోదావరిలో మునిగి గల్లంతైన చిట్టిబాబు ఆదివారం మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన పందిరి నాగమణి మృతి చెందడంతో ఆమె అంతిమ సంస్కారాల నిమిత్తం తాపేశ్వరానికి చెందిన తన అల్లుడు కాకిలేటి చిట్టిబాబు వచ్చి స్నానాల కోసం బంధువులతో పాటు పుష్కరఘాట్‌లో దిగగా నీటి ప్రవాహానికి గల్లంతైన విషయం తెలిసిందే. శనివారం అర్ధరాత్రి వరకూ గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో చిట్టిబాబు కుమారుడు కాకిలేటి రాహుల్‌కుమార్ ఎస్సై రాము, తహసీల్దార్ ఆర్.డి.రామచంద్రమూర్తి, వీఆర్వో జ్యోతికి ఫిర్యాదు చేశారు. కాగా ఆదివారం తెల్లవారుజాము నుంచి అతడి బంధుమిత్రులు మళ్లీ గాలింపు మొదలుపెట్టగా నది గట్టున పొదలలో అపస్మారక స్థితిలో ఉన్న అతడిని వారు గుర్తించారు. వెంటనే అతడిని స్థానిక పీహెచ్‌సీకి తరలించి ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం జీజీహెచ్‌కు తరలించారు. చిట్టిబాబు ఆరోగ్యంగా ఉండడంతో తాపేశ్వరంలోని బంధుమిత్రులు ఊపిరి పీల్చుకున్నారు.


