పిఠాపురం: తీవ్ర వాయుగుండం శాంతించింది. జిల్లాలో వర్షాలు ఆగిపోయాయి. కాని భారీ వర్షాల వల్ల కాలువలు పొంగి పొర్లుతుండడంతో వరదలు సంభవించి పంటలు నీటమునిగాయి. పలు లోతట్టు కాలనీలు వరద నీటిలో చిక్కుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజుల నుంచి 3,748 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా, సగటున 178 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో శుక్రవారం జిల్లాలో ఎక్కడా వర్షపాతం నమోదు కాలేదు. అయినప్పటికీ మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతుండడంతో లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయంగా మారిపోగా చెరువులు, కాలువలకు జలకళ వచ్చింది. ముఖ్యంగా ఏలేరు, సుద్దగడ్డ పీబీసీ కాలువలు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వాటి ఆయకట్టు భూముల్లో పంటలు పూర్తిగా మునిగిపోయాయి. పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాలు జలమయంగా మరాయి. చుట్టూ నీరు తప్ప ఏమి కనిపించలేదు. లోతట్టు కాలనీలు నీట మునగడంతో జనం ఇబ్బందులు పడ్డారు.
9,919 హెక్టార్లలో మునక
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు 9,919 హెక్టార్లలో వరి పంట నీట మునిగిందని జిల్లా వ్యవసాయశాఖాధికారి రామారావు తెలిపారు. 18 మండలాల్లో 162 గ్రామాల్లో 8,612 మంది రైతులకు చెందిన పంటలు నీట మునిగినట్లు చెప్పారు. వరితో పాటు 166 హెక్టార్లలో పత్తి, 111 హెక్టార్లలో మినుములు, 70 హెక్టార్లలో మొక్కజొన్న పంట దెబ్బతిందని చెప్పారు.
ఏలేరులో పెరిగిన నీటి నిల్వలు
ఏలేశ్వరం: వర్షాలకు ఏలేరు ప్రాజెక్టులో శుక్రవారం నీటి నిల్వలు పెరిగాయి. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు 14,833 క్యూసెక్కుల వరద నీటితో పాటు పురుషోత్తపట్నం నుంచి 1400 క్యూసెక్కుల నీటి నిల్వలు ప్రాజెక్టులోకి వచ్చి చేరాయి. దీంతో ప్రాజెక్టులో 86.56 మీటర్లకు గాను 80.34 మీటర్లు, 24.11 టీఎంసీలకు గాను 13.84 టీఎంసీలకు నీటి నిల్వలు చేరుకున్నాయి. దీంతో విశాఖకు 200, తిమ్మరాజుచెరుకు 50 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. ఆయకట్టుకు నీటి సరాఫరా నిలిపివేశారు.


