కాకినాడ రూరల్: నులి పురుగులు నివారణ ద్వారా పిల్లలో రక్తహీనత దూరమవుతుందని జిల్లా నోడల్ అధికారి, నులిపురుగుల నిర్మూలన ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ వి.అరుణ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగు నిర్మూలన దినోత్సవాన్ని కాకినాడ రూరల్ రమణయ్యపేటలోని ఏపీఎస్పీ క్వార్టర్స్‌లోని పీఎంశ్రీ జిల్లా పరిషత్ ప్లస్ పాఠశాలలో శుక్రవారం ఆమె ప్రారంభించారు. జిల్లాలో ఉన్న పీహెచ్‌సీలు, అంగన్‌వాడీ సెంటర్లు, స్కూల్స్, కళాశాలల్లో గోడపత్రికలు ద్వారా ప్రచారం చేశామని ఆమె తెలిపారు. ఒకటి నుంచి 19 ఏళ్ల వయసు గల వారికి అల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా రక్తహీనత నుంచి కాపాడవచ్చన్నారు. జిల్లాలో 4,073 విద్యా సంస్థల్లో ఉన్న 4,71,574 మంది పిల్లలు లక్ష్యంగా కార్యక్రమం చేపట్టామన్నారు. జిల్లాలో కొన్ని మండలాలలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించడంతో కేవలం 9 మండలాల పరిధిలోని 2,05783 మంది పిల్లలకు 44 శాతం వరకు మాత్రలు మింగించామన్నారు. డీఈఓ సుబ్బారావు, డాక్టర్లు ప్రశాంతి, మాధవి, హెచ్‌ఎం శ్రీనివాసరావు, ఎంఈఓ ఈశ్వరశాస్త్రి తదితరులు పాల్గొన్నారు.


