వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా విభాగం
ఉపాధ్యక్షురాలు నాగమణి విమర్శ
కాకినాడ రూరల్: ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పథకాలంటూ యువత, మహిళలు, రైతులు, విద్యార్థులకు ఇచ్చిన హామీల అమలుపై పూర్తి లెక్కలు చెప్పకుండా.. ఇప్పుడు ప్రభుత్వ ప్రచారం కోసం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు ప్రజాధనం ఖర్చు చేయడం ఏంటని వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి ప్రశ్నించారు. ఒక చంకలో జనసేన, మరో చంకలో బీజేపీ అనే రెండు ఊతకర్రలతో నడుస్తున్న చంద్రబాబు ప్రభుత్వం, ఇప్పుడు ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను మరో ఊతకర్రగా చేసుకుంటోందని విమర్శించారు. 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం వంటి హామీల అమలుపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో ఇన్‌ఫ్లుయెన్సర్ల కోసం ఎంత ప్రజాధనం ఖర్చు చేస్తారో, ఎవరికి ఎంత చెల్లిస్తారో బహిర్గతం చేయాలన్నారు. సాయికృష్ణ వ్యవహారం, డీఎస్సీ వంటి అంశాల్లో ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రచారంతో వాస్తవాలకు రంగులు అద్దే ప్రయత్నం చేస్తున్నారని నాగమణి ఆరోపించారు. ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బులకు కొరత అంటున్న ప్రభుత్వం.. ప్రచారానికి మాత్రం నిధులు ఎలా సమకూరుస్తోంది? అని ప్రశ్నించారు.‘హామీల అమలు ముందు.. ప్రచారం తర్వాత. ప్రజల సంక్షేమం ముందు.. ప్రభుత్వ డబ్బా తర్వాత. ప్రజల సొమ్ముతో ప్రచారం చేయించుకోవడం కాదు.. ముందుగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయండి’ అని నాగమణి డిమాండ్ చేశారు.
నీట్‌లో ఆలిండియా
783వ ర్యాంక్
కాకినాడ రూరల్: నీట్ పీజీ ఫలితాల్లో కాకినాడకు చెందిన డాక్టర్ హర్షసాయి చైతన్య ఆలిండియా స్థాయిలో 783వ ర్యాంక్ సాధించారు. అతను కాకినాడ ట్రాఫిక్–1 పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ శ్రీషణ్ముఖరావు కుమారుడు. కాకినాడ అశోక్‌నగర్‌లోని ఓ హైస్కూల్‌లో పదో తరగతిలో 9.8 జీపీఏ సాధించారు. విజయవాడలోని ఓ కళాశాలలో ఇంటర్ బైపీసీ పూర్తి చేసి 949 మార్కులు సాధించారు. నీట్ యూజీ స్టేట్ లెవల్‌లో ఎంబీబీఎస్ 732వ ర్యాంక్ సాధించి, కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు పొంది 2025లో విజయవంతంగా పూర్తి చేశారు. ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత ఎలాంటి ఆఫ్‌లైన్ కోచింగ్ లేకుండా, ఆన్‌లైన్ యాప్ ద్వారా శిక్షణ పొంది తొలి ప్రయత్నంలోనే నీట్ పీజీలో ఈ అత్యుత్తమ ర్యాంక్ సాధించడం విశేషం. భవిష్యత్తులో జనరల్ మెడిసిన్ విభాగంలో స్పెషలైజేషన్ చేయడమే తన లక్ష్యమని డాక్టర్ హర్ష సాయి చైతన్య తెలిపారు.
మద్యం దుకాణాలకు
దరఖాస్తుల ఆహ్వానం
కాకినాడ క్రైం: జిల్లాలో మొత్తం 171 మద్యం దుకాణాలకు 133 రెన్యువల్ అయ్యాయని ప్రొహిబిషన్ ఎకై ్సజ్ అధికారి కృష్ణకుమారి శుక్రవారం రాత్రి తెలిపారు. మిగిలిన 38 మద్యం దుకాణాల లైసెన్స్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఆమె వివరించారు. తాళ్లరేవు ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో 4 దుకాణాలు, కాకినాడ సౌత్ స్టేషన్ పరిధిలో 4, నార్త్ స్టేషన్ పరిధిలో 8, పెద్దాపురం, పిఠాపురం పరిధిలలో 7, 8, ప్రత్తిపాడు, తుని స్టేషన్ల పరిధిలో 2, 5 దుకాణాల ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. ఆసక్తి ఉన్నవారు రూ. 3 లక్షలు నాన్ రిఫండ్‌బుల్ దరఖాస్తు ఫీజుతో పాటు, రూ.వెయ్యి ప్రోసెసింగ్ ఫీజును డీడీ, చలనా రూపంలో చెల్లించాలన్నారు. అక్టోబర్ 1వ తేదీ రాత్రి 12 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు దరఖాస్తుదారులు స్థానిక ప్రొహిబిషన్ ఎకై ్సజ్ స్టేషన్ల పరిధిలోని అధికారులను సంప్రదించాలన్నారు.
ధాన్యం సేకరణకు చర్యలు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం సేకరణను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పటిష్ట కార్యాచరణ సిద్ధం చేయాలని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ తెలిపారు. ఖరీఫ్ ధాన్యం సేకరణపై శుక్రవారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతులు పండించిన ప్రతి గింజకు ప్రభుత్వ మద్దతు ధర అందించేలా, కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని వసతులు ముందస్తుగా సిద్ధం చేయాలన్నారు. ఖరీఫ్‌లో 5,74,619 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నామన్నారు.


