సామర్లకోట: స్థానిక పెన్షన్‌లైన్‌కు చెందిన వ్యక్తి శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు పట్టా సవర్నాయుడు (పీఎస్ నాయడు) (40) స్థానిక ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో ఐస్ పార్లర్ పరిశ్రమ నిర్వహిస్తున్నాడు. అంతకు ముందు ఆటో నిర్వహిస్తూ వ్యాపారం చేయడానికి ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో ఖాళీగా ఉన్న ఐస్ పార్లర్ తీసుకున్నట్టు ఆటో యూనియన్ నాయకులు తెలిపారు. శనివారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన నాయుడు మధ్యాహ్నం భోజనానికి రాక పోవడం, ఐస్ పార్లర్‌లో లేక పోవడంతో పట్టణంలోని బంధువుల ఇళ్లలో గాలించినా ఫలితం లేకపోవడంతో ఆయన బంధువులు విషయాన్ని ఆటో యూనియన్ నాయకులకు తెలియజేసి పోలీసులను ఆశ్రయించారు. నాయుడు వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను సిగ్నల్ ద్వారా గుర్తించి పెద్దాపురం రోడ్డులోని స్టేట్ బ్యాంకు సమీపంలోని అన్నపూర్ణ కల్యాణ మండపం వద్ద ఉన్నట్టు తెలుసుకున్నారు. శనివారం రాత్రి అక్కడకు చేరుకుని అక్కడి వాచ్‌మన్‌ను నాయుడు గురించి అడిగారు. దీంతో అతడు రెండో అంతస్తులో ఉన్నాడని, విశ్రాంతి తీసుకుంటానని ఉదయం వెళ్లాడని చెప్పాడు. పోలీసులు ఆ గది వద్దకు వెళ్లి కిటికీ నుంచి చూడగా నాయుడు ఉరి వేసుకోవడాన్ని చూసి, తలుపు గడియ తొలగించి మృతదేహాన్ని దించి దర్యాప్తు ప్రారంభించారు. అతడు కొంత కాలంగా మానసిక ఇబ్బంది, అనారోగ్యంతో బాధపడుతున్నట్టు బంధువులు తెలిపారని ఎస్సై ఎస్‌వీఎస్‌ఎన్ మూర్తి వివరించారు.
రోడ్డు ప్రమాదంలో
వ్యక్తి దుర్మరణం
తాళ్లరేవు: జాతీయ రహదారి 216లో చొల్లంగి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బొడ్డు వెంకటేశ్వరరావు (50) అనే వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. కోరంగి ఎస్‌ఐ పి.సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు కరప మండలం ఉప్పలంక గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు, అతని కుమారుడు బొడ్డు తబన్‌బాబులు ఆటోలో మట్లపాలెం వెళుతుండగా, యానాం వైపు నుంచి అతి వేగంగా వస్తున్న మోటార్ సైకిల్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వెంకటేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందగా, ఆటో డ్రైవర్ నాగబాబు, తబన్‌బాబులకు స్వల్ప గాయాలయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
మందుల లోడు లారీలో
అగ్నిప్రమాదం
రూ.5 లక్షల ఆస్తినష్టం
తుని రూరల్: విశాఖపట్నానికి గూడ్స్ లారీలో తరలిస్తున్న మందులు లోడులో అగ్ని ప్రమాదం సంభవించడంతో రూ.ఐదు లక్షల నష్టం వాటిల్లినట్టు ఇన్‌చార్జి అగ్నిమాపక అధికారి కె.భాస్కరరాజు తెలిపారు. శనివారం హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి ప్రైవేట్ గూడ్స్ లారీలో మందులు తరలిస్తుండగా తుని మండలం తేటగుంట శివారు రాజుల కొత్తూరు వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగిందన్నారు. వాహనం వేగంగా వెళ్తుంతుండగా మందులు ఒకదానితో మరోకటి రాపిడికి గురై మంటలు వ్యాపించినట్టు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఏ ప్రమాదం జరగలేదన్నారు. నష్టం మరింత ఎక్కువగా ఉంటుందని డ్రైవర్ తెలిపారు.


