ఆనంద సాగరం | - | Sakshi
Sakshi News home page

ఆనంద సాగరం

Aug 27 2026 12:12 AM | Updated on Aug 27 2026 12:12 AM

అల్లవరం: జీవనాధారమైన సముద్రమే తమవారి బతుకుల్ని చిదిమేసిందేమోనని ఆ మత్స్యకార కుటుంబాల వారు ఎంతో కుమిలిపోయారు. జాడ తెలియకుండా పోయిన తమవారు ఏమైపోయారోనని తల్లడిల్లిపోయారు. ఏడ్చి ఏడ్చి వారి కన్నీరు ఇంకిపోయింది. వారు క్షేమంగా రావాలని ఆ గంగమ్మ తల్లిని, కోటి దేవుళ్లను ప్రార్థించారు. పొడిబారిన కళ్లతో తీరం వైపే చూస్తూ రోజులు గడుపుతున్నారు. వారి మొరలను ఆ దేవుడు ఆలకించాడో ఏమో కానీ.. మూడు వారాలకు పైగా ఆచూకీ తెలియకుండా పోయిన ఆ ఏడుగురు మత్స్యకారుల క్షేమ సమాచారం బుధవారం అందింది. దీంతో, ఆ కుటుంబాలు ఒక్కసారిగా ఆనంద సాగరంలో మునిగిపోయాయి.

ఈ నెల 3న బయల్దేరి..

ఓడలరేవు తీరం నుంచి సంగాడి తాతారావు (బలుసుతిప్ప), కొల్లాటి ఏసుదాసు (ఆరగట్లపాలెం, బెండమూర్లంక), పాలెపు శాంతారావు (ఓడలరేవు), కర్రి రాముడు (ఎన్‌.రామేశ్వరం), కాటాడి సతీష్‌ (పశువుల్లంక, ఐ.పోలవరం మండలం), కొల్లాటి శ్రీనుబాబు (ఓడలరేవు)తో పాటు ముత్యాలమ్మ బోటు (ఏపీ ఈ8 ఎంఓ135) యజమాని కొపనాతి రామకృష్ణవర్మ (కొమరగిరిపట్నం) కలసి ఈ నెల 3న సముద్ర లోతు జలాల్లో వేటకు వెళ్లారు. తీరం నుంచి బయల్దేరిన గంట వరకూ తన తమ్ముడు భవాని శంకరం ఫోనుకు రామకృష్ణవర్మ అందుబాటులో ఉన్నారు. ఆ తరువాత మత్స్యకారుల మొబైల్‌ నెట్‌వర్క్‌ పని చేయలేదు. వేటకు వెళ్లిన మత్స్యకారులు 10 రోజుల తర్వాత ఈ నెల 13న తీరానికి తిరిగి చేరాల్సి ఉంది. కానీ, వారి జాడ తెలియకుండా పోయింది. ఈ విషయం ఈ నెల 17న వెలుగులోకి వచ్చింది. అనంతరం, ఆ మత్స్యకారుల ఆచూకీ కోసం జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి మేరకు కోస్టుగార్డు, తూర్పు నౌకాదళం సముద్రంలో 300 నాటికల్‌ మైళ్ల విస్తీర్ణంలో గాలింపు ఆరంభించాయి. ట్రాన్స్‌పాండర్‌ లేకపోవడంతో బోటు ఎక్కడుందో గుర్తించడం కష్టంగా మారింది. రోజులు గడుస్తున్నా వారి జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆందోళన చెందారు.

గాలివాటుకు.. దిఘా తీరానికి..

చివరకు వారి బోటు సముద్రంలో గాలివాటుకు పయనిస్తూ పశ్చిమ బెంగాల్‌లోని దిఘా తీరానికి చేరుకుంది. అక్కడి మత్స్యకారులు వీరిని గుర్తించి, సురక్షితంగా తీరానికి చేర్చారు. అనంతరం, అక్కడ తన మొబైల్‌ ఫోన్‌కు చార్జింగ్‌ పెట్టుకుని, రామకృష్ణవర్మ కొమరగిరిపట్నంలోని తన సోదరుడు భవాని శంకరానికి తమ క్షేమ సమాచారం అందించారు. మత్స్యకారులు తమ బోటుతో దిఘా తీరానికి చేరుకున్నట్లు కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌ కూడా ధ్రువీకరించారు. దీంతో, 23 రోజుల ఉత్కంఠకు ఎట్టకేలకు శుభం కార్డు పడింది. ఒకటీ రెండూ కాదు.. ఏకంగా 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి గెలిచిన తమ వారిని తలచుకుని, ఆ కుటుంబ సభ్యులు ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారు. పశ్చిమ బెంగాల్‌ నుంచి ఈ ఏడుగురు మత్స్యకారులను మరో బోటు సాయంతో సురక్షితంగా స్వస్థలానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు. దిఘా నుంచి వారి బోటు గురువారం బయల్దేరనుంది. ఏడుగురు మత్స్యకారులు సురక్షితంగా దిఘా తీరానికి చేరుకోవడంపై ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్‌, మాజీ ఎంపీ చింతా అనురాధ హర్షం వ్యక్తం చేశారు. ఆ మత్స్యకారులను స్వస్థలానికి త్వరితగతిన తీసుకురావాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.

దిఘా తీరానికి క్షేమంగా చేరుకున్న మత్స్యకారులు కొపనాతి రామకృష్ణవర్మ, కొల్లాటి ఏసుబాబు, సంగాడి తాతారావు, కర్రి రాముడు, కాటాడి సతీష్‌కుమార్‌, కొల్లాటి శ్రీనుబాబు, పాలెపు శాంతారావు

గేర్‌ బాక్స్‌ పాడై..

చేపల వేటకు వెళ్లిన ఈ ఏడుగురు మత్స్యకారులు ఓడలరేవు తీరం నుంచి 100 నాటికల్‌ మైళ్ల దూరంలో ఒక రోజు వేట సాగించుకుని ముందుకు పయనమయ్యారు. నడిసంద్రంలో ఉండగా సరిగ్గా అదే సమయంలో వారి బోటులోని గేర్‌ బాక్సు పాడైంది. తమకున్న పరిజ్ఞానంతో ఆ మత్స్యకారులు గేర్‌ బాక్సుకు మరమ్మతులు చేసుకుని ముందుకు కదిలారు. కొంతసేపటి తర్వాత ఇంజిన్‌ వేడెక్కి బోటు ఆగిపోయింది. ఇక చేసేదేమీ లేక గాలివాటు ఆధారంగా ఆ మత్స్యకారులు తమ బోటు ప్రయాణాన్ని కొనసాగించారు. వేటకు బయల్దేరినప్పుడు 15 రోజులకు సరిపడ గ్రాసాన్ని మాత్రమే తీసుకెళ్లారు. ఊహించని విధంగా బోటు పాడవడం.. తీరానికి చేరే దారి లేకపోవడంతో ఉన్న కొద్దిపాటి ఆహార పదార్థాలను ఒక పూట తింటూ, మరో పస్తులుంటూ 20 రోజులు గడిపారు. చివరి మూడు రోజులూ నీళ్లు మాత్రమే తాగుతూ ప్రాణాలు నిలుపుకొన్నారు.

23 రోజుల తర్వాత అందిన మత్స్యకారుల క్షేమ సమాచారం

సంతోషంలో

మునిగిన కుటుంబ సభ్యులు

ఇంజిన్‌ పాడై గాలివాటుకు

పశ్చిమ బెంగాల్‌ తీరానికి చేరిన బోటు

నేడు స్వస్థలానికి

తీసుకొచ్చేందుకు సన్నాహాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement