తాళ్లరేవు: హైదరాబాద్ దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (ఎఫ్‌బీఓ) ట్రైనీలు బుధవారం కోరింగా అభయారణ్యాన్ని సందర్శించారు. స్టడీ టూర్‌లో భాగంగా చొల్లంగిలోని కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజాన్ని (సీబీఈటీ) సందర్శించి, పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఫారెస్ట్ రేంజర్ ఎస్‌ఎస్‌ఆర్ వరప్రసాద్, ఎఫ్‌బీఓ కె.మహేష్‌లు మడ అడవుల విశిష్టత, వన్యప్రాణుల సంరక్షణ, సముద్ర తాబేళ్ల ప్రాముఖ్యతలను వివరించారు. అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ వి.మంజుక్ సిబ్బంది పాల్గొన్నారు.
టెట్ నుంచి
మినహాయింపు ఇవ్వాలి
ముమ్మిడివరం: ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏపీ టీచర్స్ ఫెడరేషన్–1938 జిల్లా శాఖ ఆధ్వర్యాన ముమ్మిడివరంలోని విద్యా శాఖ కార్యాలయం ఎదుట బుధవారం నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రత్యేక టెట్ నోటిఫికేషన్‌లో ఏపీటీఎఫ్–1938 సూచనల మేరకు కొన్ని సవరణలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా శాఖ అధ్యక్షుడు ఎస్‌ఎన్ మునేశ్వరరావు మాట్లాడుతూ, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపునిచ్చేందుకు తమిళనాడు ప్రభుత్వం మాదిరిగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని కోరారు. లేదంటే టెట్ అర్హత మార్కులు తగ్గించాలని డిమాండ్ చేశారు.


