కాకినాడ క్రైం: పిఠాపురం ఏఈ టి.నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య కేసుకు సంబంధించి పోలీసుల్ని ముప్ప తిప్పలు పెట్టిన సాధిక్‌ఖాన్‌ను నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు చేశారు. పోలీసుల చేజింగ్ తీరు థ్రిల్లర్ చిత్రాన్ని తలపించింది. ఇందులో పోలీసుల నెట్‌వర్కింగ్‌తో సహా వారి సమన్వయం ఔరా అనిపించింది. సుమారు 70 మంది పోలీసులు ఐదు రాష్ట్రాల్లో నిందితుడి కోసం జల్లెడ పడుతుంటే చివరకు మహారాష్ట్రలో గుర్తించారు. సరిగ్గా అక్కడ గస్తీ కాస్తున్న జిల్లా, స్థానిక పోలీసులు సమీపించే సరికి ఒకే చోట ఉండడం సేఫ్ కాదని భావించిన సాధిక్ అక్కడి నుంచి మీరట్‌కు పయనమయ్యాడు. ఈ విషయంతో పాటు అతడు కేరళ పారిపోయే యోచనలో ఉన్నాడని అధికారులు ఎస్పీ బిందుమాధవ్‌కు వివరించారు. దీంతో స్పందించిన ఎస్పీ తుని రూరల్ సీఐ గీతారాంకృష్ణ, ఇంద్రపాలెం ఎస్‌ఐ ఎం.వీరబాబు, ఇంద్రపాలెం కానిస్టేబుల్ మొయిన్‌లను సాధిక్‌ను అరెస్టు చేసి తీసుకురావలసిందిగా ఆదేశించి విమానంలో పంపారు. వారు సాధిక్ స్నేహితుడు అబ్బాస్ ఇంటి వద్దకు వెళ్లి కాపుకాయగా అక్కడ సాధిక్ పట్టుబడ్డాడు. విమానంలో వెళ్లకపోయి ఉంటే సాధిక్ కేరళ పరారయ్యేవాడని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
‘గొడవ రెండు కుటుంబాలది,
రెండు మతాలది కాదు’
– సీనియర్ న్యాయవాది జవహర్ అలీ
సాధిక్ ఘటన రెండు కుటుంబాలకు చెందినదే తప్ప రెండు మతాలది కాదని కాకినాడకు చెందిన సీనియర్ న్యాయవాది జవహర్ అలీ అన్నారు. కుటుంబ సభ్యులు కేసు చేయమని కోరారని, తాను ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ములాఖత్‌తో సాధిక్‌ను కలిసింది తానేనని, కేసు నేనే చేస్తున్నానన్న ప్రచారంలో వాస్తవం లేదని, తానింకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. సౌజన్యతో కలిసి ఆమె భర్తను హతమార్చడంలో భాగస్వామి కావడం, నలుగురు కుటుంబసభ్యుల్ని ఆత్మహత్యలకు పురిగొల్పడం అనే అభియోగాలు సాధిక్‌పై ఉన్నాయన్నారు. న్యాయవాదులు ఎవరూ సాధిక్ తరఫున వాదించొద్దన్న ఎంపి తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్ వ్యాఖ్యలు సరైనవి కాదని అన్నారు. ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అలీ తెలిపారు. ఓ కేసు చేయాలా వద్దా అన్నది న్యాయవాది ఇష్టమని స్పష్టం చేశారు.
ఐదు రాష్ట్రాల్లో
స్థానిక సిబ్బందితో కలసి గాలింపు
క్షణక్షణం సమాచారంతో
ఇక్కడ పావులు కదిపిన ఎస్పీ
విమానంలో వెళ్లి నిందితుడిని
పట్టుకున్న స్థానిక సిబ్బంది


