వైఎస్సార్ సీపీ మహిళా విభాగం
రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నాగమణి
కాకినాడ రూరల్: ఉపాధ్యాయులపై కూటమి ప్రభుత్వం అనవసర ఒత్తిడి తెస్తోందని, ఉద్యోగంలో చేరినప్పుడు లేని టెట్ నిబంధన ఇప్పుడు ఎందుకు అని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి బుధవారం నిలదీశారు. సంవత్సరం క్రితం ప్రభుత్వం నిర్వహించిన నియామక ప్రక్రియలో అన్ని అర్హతలను పరిశీలించి నిర్ధారించిన తరువాతే ఉపాధ్యాయ ఉద్యోగాలలోకి తీసుకున్నారని, ఇప్పుడు టెట్ రాయాలని చెప్పడం ఎంత వరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. టెట్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలలే కారణమని చెబుతున్నప్పటికీ ఆ తీర్పు అమలులో ఉపాధ్యాయులపై భారం పడకుండా మానవతా దృక్పథంతో వ్యవహరించాలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. టెట్ పేరుతో ఉపాధ్యాయులను భయపెట్టవద్దని ఉచిత శిక్షణ, తగినంత సమయం, అనేక అవకాశాలు కల్పించాలని తాము కోరుతున్నామని నాగమణి తెలిపారు. ఉపాధ్యాయుల పక్షాన వైఎస్సార్ సీపీ పోరాడుతుందన్నారు.
ఆంజనేయరెడ్డికి గ్లోబల్
ఇన్‌స్పిరేషన్ పురస్కారం
కాకినాడ రూరల్: రోడ్డు పక్కన ప్లాస్టిక్ సామగ్రిని విక్రయిస్తూ జీవనోపాధి పొందే కాకినాడకు చెందిన అనపాల ఆంజనేయరెడ్డి అవివాహితుడిగానే ఉండిపోయి తన సంపాదన అంతా సేవా కార్యక్రమాలకే కేటాయిస్తుండంతో సేవారత్నతో పాటు పలు అవార్డులను పొందారు. ఆయన సేవలకు అంతర్జాతీయంగా మరో అరుదైన గౌవరం లభించింది. గ్లోబల్ ఇన్‌స్పిరేషన్ అంతర్జాతీయ అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. ఈ మేరకు మలేషియాలోని కౌలాలంపూర్‌లో సెప్టెంబరు 9న జరగనున్న కార్యక్రమానికి హాజరవ్వాలని ఆయనకు ఆహ్వానం వచ్చింది. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా, సామాజిక సేవా రంగాలలో విశిష్ట సేవలకు పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్, మలేషియాలోని తెలుగు ఎక్స్‌పాట్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గ్లోబల్ ఇన్‌స్పిరేషన్–2026 అవార్డులు ప్రదానం చేస్తుందన్నారు. తనును ఎంపిక చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
కొండచిలువ హతం
శంఖవరం: మండలంలో జి.కొత్తపల్లి గ్రామంలో పొలాల్లో సంచరిస్తున్న కొండచిలువను స్థానికులు బుధవారం హతమార్చారు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం కొండప్రాంతం దగ్గరగా ఉండడం చేత సుమారు 10 అడుగుల ఉన్న కొండచిలువ రొడ్డు వెంబడి వెళ్తుండగా స్థానికులు చూసి భయాందోళనకు గురై దానిని హతమార్చినట్టు చెప్పారు. నిత్యం పొలాల్లో విష సర్పాలు, పురుగులు సంచరిస్తుండడం వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామన్నారు.
చినవెంకన్నకు రూ.92 లక్షల ఆభరణాల సమర్పణ
ద్వారకా తిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడేనికి చెందిన వేగుంట సాంబశివరావు, సౌందర్యలక్ష్మి దంపతులు, కుటుంబ సభ్యులు రూ.92 లక్షల విలువైన బంగారు, వెండి కవచాలను బుధవారం సమర్పించారు. మొత్తం 584 గ్రాముల బంగారం, 507 గ్రాముల వెండితో తయారు చేయించిన కవచాలను ఆలయ చైర్మన్ ఎస్‌వీ సుధాకరరావు, ఈఓ వేండ్ర త్రినాథరావులకు అందజేశారు. హస్తాలతో వక్షస్థల భాగాన్ని ఈ కవచాలపై రూపొందించారు. కార్యక్రమంలో ఈఈ డీవీ భాస్కర్, దాత కుటుంబ సభ్యులు చేవూరి లక్ష్మీనారాయణ, చేవూరి ఈశ్వర ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.


