మొత్తమోంథా వదిలేసి.. | - | Sakshi
Sakshi News home page

మొత్తమోంథా వదిలేసి..

Aug 17 2026 12:11 AM | Updated on Aug 17 2026 12:11 AM

దేశానికే అన్నం పెడుతున్న రైతన్నల నోటికాడ కూడును చంద్రబాబు ప్రభుత్వం దూరం చేస్తోంది.. ప్రకృతి కన్నెర్ర జేసి పొలాలను తుడిచి పెట్టేసినా, కనీసం అటువైపు చూడకుంది.. నెలల కిందట సంభవించిన మోంథా తుపానుతో అనేక మంది రైతులు నష్టపోయినా, పరిహారం అందించాల్సిన ప్రభుత్వం పరిహాసం చేస్తోంది.

సాక్షి ప్రతినిధి, కాకినాడ: రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చంద్రబాబు ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతుందే తప్ప.. ఆచరణలో మాత్రం ఆమడ దూరం ఉంటోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులను దగా చేస్తూనే ఉంది. అన్నదాత సుఖీభవ నిధుల్లో కోత విధించింది. ఉచిత పంటల బీమాను ఎత్తివేసింది. మోంథా తుపాను నష్ట పరిహారం మంజూరులోనూ అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. గతేడాది అక్టోబర్‌లో సంభవించిన మోంథా తుపాను కర్షకులను నిండా ముంచేసింది. అప్పట్లో భారీ ఈదురు గాలులు, వర్షాలకు వరి, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వేల ఎకరాల్లో వరి నేలకొరిగింది. వరి పొలాల్లో నీరు చేరి సింహభాగం పంటను నష్టపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇలాంటి విపత్కర సమయంలో అండగా ఉండాల్సిన చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. తూతూ మంత్రంగా పంట నష్టం అంచనాలు రూపొందించి మమ అనిపించేసింది. నష్టం అంచనా వేసి అనేక నెలలు కావొస్తున్నా.. నేటికీ పరిహారం మంజూరు చేసిన దాఖలాలు లేవు. పరిహారం ఊసేలేదు.

అంతా అతలాకుతలం

మోంథా తుపాను దెబ్బకు రైతులు అతలాకుతలం అయ్యారు. జిల్లా వ్యాప్తంగా తుపాను నష్టాలపై కసరత్తు చేసిన అధికారులు తుది నివేదిక రూపొందించి ప్రభుత్వానికి పంపారు. జిల్లాలో 2.10 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. అధికారిక లెక్కల ప్రకారం వ్యవసాయ, ఉద్యాన పంటలకు సంబంధించి 46,929 మంది రైతులు నష్టపోయారు. మొత్తం 50,815 ఎకరాల్లో వివిధ రకాల పంటలు దెబ్బతినగా.. వాటి విలువ రూ.52.17 కోట్లుగా నిర్ధారించారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం, పిఠాపురం రూరల్‌, గొల్లప్రోలు, యు.కొత్తపల్లి మండలాలతో పాటు సామర్లకోట, పెద్దాపురం, కిర్లంపూడి, గోకవరం, కాకినాడ రూరల్‌, కరప తదితర మండలాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రతి రైతూ ఎకరానికి రూ.36 వేలకు పైగా నష్టపోయారు. అలాగే ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. మొక్కజొన్న 64 ఎకరాలు, తీపి మొక్కజొన్న 64.715 ఎకరాల్లో నష్టం వాటిలినట్లు తేల్చారు. అంచనాలు రూపొందించి పదకొండు నెలలు దాటుతున్నా.. నయాపైసా నష్టపరిహారం అందించిన దాఖలాలు లేవు.

పరిహారం చెల్లింపులోనూ కుట్ర

తుపాను కారణంగా దెబ్బతిన్న వరికి ఎకరానికి రూ.10 వేలు, మిగిలిన పంటలకు రూ.6 వేల చొప్పున ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి అన్ని పంటలూ కలిపి జిల్లా వ్యాప్తంగా రైతులకు రూ.150 కోట్లకు పైనే నష్టపోగా.. ప్రభుత్వం మాత్రం రూ.52.17 కోట్లుగా తేల్చింది. ఈ పరిణామం రైతుల్లో ఆగ్రహావేశాలు నింపుతోంది. జరిగిన నష్టాన్ని సైతం తక్కువగా చూపి.. పరిహారంలో కోత విధించేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగమేనన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

నిబంధనల కొర్రి పెట్టి..

తుపాను ప్రభావంతో నష్టపోయిన పంట నమోదులో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించింది. పంట నష్టపోయిన రైతులందరి పేర్లు నమోదు చేయలేదు. 33 శాతం కంటే ఎక్కువ నష్టపోతే మాత్రమే నమోదు చేసింది. జిల్లాలో అత్యధికంగా 33 శాతం కంటే తక్కువగా పంట నష్టం వాటిల్లింది. సుమారు 10 వేల హెక్టార్లకు పైగా ఇదే పరిస్థితి నెలకొంది. వీరి పరిస్థితేంటో అర్థం కావడం లేదు.

ఉచిత పంటల బీమాకు మంగళం

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత పంటల బీమా పథకానికి మంగళం పాడింది. ప్రీమియం సొమ్ము చెల్లింపులు నిలిపివేసింది. ఆ భారం రైతులపైనే మోపింది. ఈ మేరకు 2024–25 రబీ సీజన్‌లో ఉత్తర్వులు సైతం వెలువరించింది. వరి పంట హెక్టారు రూ.1.05 లక్షలుగా విలువ నిర్ధారించి రైతు వాటాగా 1.50 శాతం అంటే రూ.1,575 ప్రీమియం చెల్లించాల్సి ఉంది. ఇది రైతులే చెల్లించుకునేలా మార్గదర్శకాలు రూపొందించి అమలు చేసింది. జిల్లా వ్యాప్తంగా 2,15,068 ఎకరాల్లో ఖరీఫ్‌ సాగు చేయగా.. రైతులు ఎకరాకు రూ.210 చొప్పున 72,766 ఎకరాలకు మాత్రమే ప్రీమియం చెల్లించారు. మిగిలిన 1,42,302 ఎకరాలు క్రాఫ్‌ ఇన్సూరెన్స్‌కు దూరంగా ఉండటం గమనార్హం. ఫలితంగా మోంథా తుపానుకు నష్టపోయిన రైతులు బీమా పరిహారం పొందలేని పరిస్థితి తలెత్తింది. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వ్యవసాయం, రైతుల సంక్షేమానికి పెద్దపీట వేసింది. మిచాంగ్‌ తుపాను ప్రభావంతో పంట నష్టపోయిన కర్షకుల కన్నీళ్లు తుడిచింది. నెలల వ్యవధిలోనే పంటలకు పరిహారం మంజూరు చేసింది.

ఆదుకోవడంలో విఫలం

రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. నష్టపోయిన పంటలకు సైతం నెలలు దాటుతున్నా, నేటికీ పరిహారం ఇవ్వకపోవడం దారుణం. పంటలకు కనీసం యూరియా సైతం ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందంటే, రైతుల సంక్షేమానికి ఏ మాత్రం పాటుపడుతుందో అర్థం అవుతోంది.

–లంకా ప్రసాద్‌, వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు

ఇంకా పరిహారం ఇవ్వలేదు

వేమవరం రెవెన్యూ పంచాయతీ పరిధిలో ఎకరంన్నర భూమి ఉంది. అందులో వరి వేయగా, మోంథా తుపానుతో నీట మునిగింది. రూ.40 వేల పెట్టుబడి పెట్టాను. రూ.60 వేల ఆదాయం వచ్చేది. గతంలో అధికారులు నష్టపరిహారం నమోదు చేసుకున్నారు. నెలలు గడుస్తున్నా.. ప్రభుత్వం ఇంత వరకు పరిహారం చెల్లించలేదు.

– అనసూరి రాజు, రైతు,

కొత్తపేట, తొండంగి మండలం

పంట నష్టం ఇలా..

పంట నష్టపోయిన నష్టం నష్టం పెట్టుబడి రాయితీ

రైతులు ఎకరాలు (రూ.కోట్లలో) (రూ.కోట్లలో)

మొక్కజొన్న 79 64 1.72 0.03

వరి 44,522 49,473 144.60 50.05

మినుము 578 797.81 13.13 0.48

తీపి మొక్కజొన్న 65 64.715 1.73 0.03

తుపాను బాధితులకు అందని పరిహారం

జిల్లాలో రూ.52.17 కోట్ల నష్టం

నెలలు గడుస్తున్నా

పైసా విదల్చని చంద్రబాబు సర్కారు

పరిహారం కోసం రైతులకు తప్పని నిరీక్షణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement