చంద్రబాబు సర్కారు బాగోతమిది.. భావిభారత పౌరులపై చూపిన నిర్లక్ష్యమిది.. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు నాసిరకం బ్యాగులు ఇచ్చి, అపహాస్యం చేసిన వైనమిది.. ఆ బ్యాగులు ఎక్కడికక్కడే చిరిగిపోయి, జిప్‌లు, కుట్లు ఊడిపోవడం కనిపిస్తోంది. ఇది అందరినీ విస్తుపోయేలా చేసింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నాణ్యమైన బ్యాగులు ఇవ్వగా, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నాసిరకానికే పెద్దపీట వేసింది.
కాకినాడలో చిరిగిన బ్యాగ్‌ను సైకిల్ పెట్టుకుని స్కూల్‌కు
వెళ్తూ..
● విద్యార్థులకు నాసిరకం స్కూల్ బ్యాగులు
● చంద్రబాబు సర్కారు బాగోతమిది
● రెండు నెలలకే మూలకు చేరిన వైనం
● జిల్లా వ్యాప్తంగా 70 శాతం ఇదే పరిస్థితి
సాక్షి, ప్రతినిధి, కాకినాడ: భావిభారత పౌరులను సైతం మోసగించిన చరిత్రను చంద్రబాబు ప్రభుత్వం మూటగట్టుకుంది. విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకు ఉండాల్సిన స్కూల్ బ్యాగులు మూణ్ణాళ్ల ముచ్చటగానే మారాయి. బ్యాగులు అందించిన రెండు నెలలకే జిప్‌లు ఊడిపోతున్నాయి. బ్యాగు చిరిగిపోతోంది. పోనీ కుట్టించుకుని వాడుకుందామంటే కుట్టించిన రోజుల వ్యవధిలో బ్యాగు వస్త్రం చివికిపోతోంది. చేసేది లేక.. విద్యార్థులు తమ సొంత డబ్బులతో బ్యాగులు కొనుగోలు చేసుకునే పరిస్థితి తలెత్తింది. జిల్లా వ్యాప్తంగా 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులకు ‘డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’ (ఎస్‌ఆర్‌కేవీఎం) పేరుతో కిట్లు పంపిణీ చేశారు. మొత్తం 1,280 ప్రభుత్వ పాఠశాలల్లో 1,28,988 స్కూల్ బ్యాగుల కోసం విద్యా శాఖ ఇండెంట్ పెట్టింది. జూన్ 20 నాటికి 20,850 బ్యాగులు మాత్రమే జిల్లాకు వచ్చాయి. అంత తక్కువగా వచ్చినా, ఆ పార్టీ నేతలతో వాటిని ఆర్భాటంగా పంపిణీ చేయించేశారు. మిగిలినవి జూలై రెండో వారానికి దశల వారీగా వచ్చాయి.
ఇదేం కక్కుర్తి
చంద్రబాబు సర్కారు మూడు దశల్లో పంపిణీ చేసిన బ్యాగులు కనీసం రెండు నెలలు కూడా ఉండకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పుస్తకాలు ఎక్కువగా పెట్టుకుంటే బ్యాగ్ మొత్తం కుప్పకూలే పరిస్థితి ఏర్పడింది. ఇదే విషయమై తల్లిదండ్రుల సమావేశాల్లో (పీటీఎం)లలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులను నిలదీశారు. ఇచ్చిన నెలల వ్యవధిలోనే బ్యాగ్‌లు పాడైపోవడమేంటని ప్రశ్నించారు. దీంతో నీళ్లు నమిలిన విద్యాశాఖ అధికారులు పాడైన బ్యాగ్‌ల స్థానంలో కొత్త బ్యాగ్‌లు అందిస్తామని చెప్పారు. అయితే జిల్లాలో కొంత మందికి మాత్రమే ఇచ్చి.. మిగిలిన వారికి పంగనామాలు పెట్టారు. ఇలా ప్రభుత్వం పంపిణీ చేసిన 100 బ్యాగుల్లో 70 బ్యాగుల పరిస్థితి ఇలాగే ఉందన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వం రూ.2 వేలు పెట్టి కొనుగోలు చేసి.. విద్యార్థులకు ఇచ్చిన బ్యాగులు పట్టుమని రెండు నెలలు కూడా మన్నకపోవడంతో తల్లిదండ్రులు అవాక్కవుతున్నారు. చేసేది లేక చిరిగిపోయిన బ్యాగ్‌ల స్థానంలో సొంత డబ్బులతో కొత్త బ్యాగులు కొనుగోలు చేసుకుంటున్నారు.
కిట్లలోనూ కిటుకే..
చంద్రబాబు ప్రభుత్వం అందించిన విద్యార్థి మిత్ర కిట్లలోనూ కనికట్టే చూపారు. బ్యాగులు అత్యంత నాసిరకంగా ఉన్నాయి. బూట్ల సైజు సరిపోవడం లేదు. ఒక తరగతి విద్యార్థికి ఇవ్వాల్సినవి రెండో తరగతి విద్యార్థికి ఇచ్చారు. కిట్‌లో ఒక వస్తువు ఇస్తే మరో వస్తువు ఉండటం లేదు. బ్యాగులతో పాటు డిక్షనరీలు, యూనిఫాం, సాక్స్‌లు ఇవ్వకపోవడంతో తల్లిదండ్రులే కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గతమెంతో ఘనం
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ‘జగనన్న విద్యా కానుక’ పేరుతో నాణ్యమైన బ్యాగ్‌లు, బూట్లు, యూనిఫామ్ అందించేవారు. పైగా పాఠశాలలు తెరిచేందుకు రెండు నెలల ముందే విద్యార్థులకు కానుకలు చేరేవి. అలా ఏటా 1.59 లక్షల మందికి పైగా విద్యార్థులకు నాణ్యమైన కిట్లు అందించేవారు. ఇందుకు గాను సుమారు రూ.30 కోట్లు వెచ్చించేవారు.
కొనుగోలు
చేసుకున్న
కొత్త బ్యాగ్‌తో..
కమీషన్లు దండుకోవడం సిగ్గుచేటు
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కూటమి ప్రభుత్వం సరఫరా చేస్తున్న స్కూల్ బ్యాగులు వారం రోజుల్లోనే చిరిగిపోతున్నాయి. ఈ బ్యాగుల సరఫరాలో కమీషన్లు దండుకోవడం సిగ్గుచేటు. మార్కెట్‌లో రూ.150 కూడా చేయని నాసిరకం బ్యాగులు ఇచ్చారు. జిప్‌లు పనిచేయడం లేదు, బెల్టులు తెగిపోతున్నాయి, కుట్లు ఊడిపోతున్నాయి. బడా కాంట్రాక్టర్లకు రూ.వేల కోట్లు కట్టబెట్టారు. గత ప్రభుత్వం ఇచ్చిన కిట్లను రద్దు చేసి, నాసిరకం సరుకు ఇవ్వడం ద్వారా పేద విద్యార్థులను అవమానిస్తున్నారు. జిల్లాలో పంపిణీ చేసిన అన్ని బ్యాగులను వెనక్కి తీసుకుని, నాణ్యమైన బ్యాగులు ఇవ్వాలి.
– చింతలపూడి సునీల్, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యుడు


