కాకినాడ క్రైం: స్థానిక జీజీహెచ్‌లో క్యాన్సర్ సేవల కోసం హైఎనర్జీ లీనియర్ యాక్సిలరేటర్ మెషీన్ మంజూరైంది. ఓఎన్జీసీ సంస్థ సౌజన్యంతో ఈ పరికరం సమకూరింది. ఈ మేరకు, శనివారం ఆసుపత్రి అధికారులు రేడియాలజీ కాన్ఫరెన్స్ హాల్లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ సూపరింటెండెంట్, రేడియేషన్ అంకాలజీ ప్రొఫెసర్, హెచ్‌ఓడీ శ్రీనివాసన్ మాట్లాడుతూ, క్యాన్సర్ బాధితులకు చికిత్స, నివారణ కోసం రేడియేషన్ చేస్తామన్నారు. ఇందుకు జీజీహెచ్లో తక్కువ సామర్థ్యం ఉన్న టెలీ కోబాల్ట్ మెషీన్‌ను వినియోగిస్తున్నామన్నారు. ఒక రోజులో గరిష్టంగా 30 మందికి మాత్రమే రేడియేషన్ ఇవ్వగలుతున్నామన్నారు. అయితే కొత్తగా మంజూరైన హైఎనర్జీ లీనియర్ యాక్సిలరేటర్ ద్వారా ఒక రోజులో 100 మందికిపైగా క్యాన్సర్ బాధితులకు రేడియేషన్ చేయవచ్చని తెలిపారు. ఈ యంత్రం ధర రూ.36.6 కోట్లు కాగా, రూ.3.5 కోట్ల విలువైన సీటీ సిమ్యులేటర్‌ను ఓఎన్జీసీ అందిస్తోందన్నారు. వీటిని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ ఐటీఐ సమీపంలో మూడెకరాల్లో నిర్మిస్తున్న క్యాన్సర్ ఆసుపత్రి ఆవరణలో 12,800 ఎస్‌ఎఫ్‌టీ విస్తీర్ణంలో ప్రత్యేక విభాగాన్ని నిర్మించామన్నారు. భారీ బంకర్లు సిద్ధమయ్యాయని, యంత్రాలను వీటిలోనే ఉంచుతామని శ్రీనివాసన్ తెలిపారు. ప్రస్తుత కలెక్టర్ హరేంధిర ప్రసాద్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి యంత్రం జీజీహెచ్‌కు మంజూరు అయ్యేలా అన్ని అధికారిక కార్యకలాపాలు సకాలంలో పూర్తి చేశారన్నారు.


