ఆత్రేయపురం: మండలంలోని వాడపల్లి వవేంకటేశ్వరుని దర్శనానికి శనివారం భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. భక్తుల గోవింద నామ స్మరణతో మాడవీధులు మార్మోగాయి. స్వామివారిని సుమారు లక్షకు పైగా భక్తులు దర్శించారని, భారీ ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో, దేవదాయ శాఖ ఉప కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్థానిక గౌతమి గోదావరిలో స్నానమాడి అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. భారీ భక్తజనంతో క్యూలైన్లు నిండిపోయాయి. ఆలయంలో సుప్రభాత సేవ, తొలి హారతి, నీరాజనం, ఐశ్వర్య లక్ష్మీ హోమం, బాలభోగం నిర్వహించారు. భక్తులు విశిష్ట దర్శనం, ఉచిత దర్శనం ద్వారా స్వామిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. క్షేత్రపాలకులు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామిని భక్తులు దర్శించారు. భక్తులు ఉచిత అన్న ప్రసాదం, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆర్యవైశ్య సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులుకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈఓ సూర్యచక్రధరరావు, చైర్మన్ ముదునూరి వెంకటరాజు, కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు వాడపల్లి సుందర శేషావతారం స్వామి వారి పూజలు, సేవలు, కై ంకర్యాలను పర్యవేక్షించారు.


