ప్రతి అర్జీకీ పరిష్కారం చూపుతాం: కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రతి అర్జీకీ పరిష్కారం చూపుతాం: కలెక్టర్‌

Aug 23 2026 12:22 AM | Updated on Aug 23 2026 12:22 AM

కాకినాడ రూరల్‌: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)కు వచ్చే ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతామని కలెక్టర్‌ ఎంఎస్‌ హరేంధిర ప్రసాద్‌ అన్నారు. వన్‌ మంత్‌ – వన్‌ విలేజ్‌– ఫోర్‌ విజిట్‌లో భాగంగా రమణయ్యపేట సర్పవరం జంక్షన్‌ వద్ద ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం పీజీఆర్‌ఎస్‌ నిర్వహించారు. కాకినాడ రూరల్‌, కరప మండలాలకు చెందిన పలువురు వచ్చి అర్జీలు అందజేయడంతో వాటిని కలెక్టర్‌ తీసుకుని సంబంధిన అధికారులను విచారించి, పరిష్కారానికి హామీలు ఇచ్చారు. కలెక్టరు మాట్లాడుతూ రూరల్‌లో సుమారు 60కు పైగా అర్జీలు వచ్చాయన్నారు.

పరిష్కారం చూపకుంటే ఎలా..

తమ అర్జీలకు పరిష్కారం చూపని గ్రీవెన్స్‌లు ఎందుకుని తిమ్మాపురం మాజీ సర్పంచ్‌ బెజవాడ సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. తిమ్మాపురంలో ఎకరం స్థలంలో నాన్‌ లేఅవుట్‌పై తాము గతంలో ఫిర్యాదు చేశామని, పంచాయతీ తీర్మానం చేసినా అధికారులు చర్యలు తీసుకోలేదని ఆయన కలెక్టర్‌కు వివరించారు. గ్రామ పరిధిలో అనుమతులు లేకుండా ఓ ఫంక్షన్‌ హాలు నిర్మించారని, అలాగే తిమ్మాపురంలోని ఓ పీజీ స్టడీ సెంటర్‌లో అనుమతి లేకుండా భవనాలను నిర్మించారన్నారు.

అనుకూలంగా ఉన్నందుకా..

తిమ్మాపురం గ్రామ పంచాయతీలలో లైబ్రరీ అటెండర్‌గా దొరబాబు అనే దివ్యాంగుడు దాదాపు 16 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. వైఎస్సార్‌ సీపీ చెందిన గ్రామ మాజీ సర్పంచ్‌ బెజవాడ సత్యనారాయణకు అనుకూలంగా ఉంటున్నాడనే ఒక్క కారణంతో అతడి సర్వీసును పరిగణనలోకి తీసుకోకుండా కూటమి నేతల ఒత్తిడితో విధులకు రావద్దని హుకుం జారీ చేయడంతో పాటు రెండు నెలలుగా జీతం అందించలేదు. దీంతో దొరబాబు తన ఆవేదనను జిల్లా కలెక్టర్‌కు లిఖిత పూర్వకంగా తెలిపాడు. దీనిపై పంచాయతీ కార్యదర్శి రాజబాబును కలెక్టర్‌ వివరణ కోరడంతో లైబ్రరీ లేదని తెలిపారు.

మెట్ల వద్ద వేచి ఉన్న

వృద్ధుడు

కాకినాడ రూరల్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్‌కు కలెక్టర్‌ వారడడంతో సర్పవరానికి చెందిన వృద్ధుడు వాసంశెట్టి వెంకటకృష్ణ అర్జీ ఇచ్చేందుకు వచ్చి సుమారు గంటకు పైగా వీల్‌ చైర్‌లోనే ఉన్నారు. మొదటి అంతస్తులో గ్రీవెన్స్‌ జరగడంతో అక్కడకు వీల్‌ చైర్‌లో వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఒంటి గంటకు కార్యక్రమం ముగించుకుని కిందకు వచ్చిన కలెక్టరు హరేంధిర ప్రసాద్‌కు అర్జీని ఆయన అందించారు. తనకు వృద్ధాప్య పింఛను వస్తుందని, కాలు దెబ్బతినడంతో నడవలేని స్థితిలో ఉన్న తనకు దివ్యాంగ పింఛను ఇప్పించాలని వేడుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement