నూకరాజు కుటుంబం ఆత్మహత్య కలచివేసింది | - | Sakshi
Sakshi News home page

నూకరాజు కుటుంబం ఆత్మహత్య కలచివేసింది

Aug 23 2026 12:22 AM | Updated on Aug 23 2026 12:22 AM

కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌

కాకినాడ రూరల్‌: పిఠాపురం పంచాయతీరాజ్‌ ఏఈ టి.నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం కలచివేసిందని జిల్లా కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ అన్నారు. ఉద్యోగులు కుటుంబ పరమైన సమస్యలను, ఒత్తిడి, మానసిక ఇబ్బందులను సహచర ఉద్యోగులతో పంచుకోవాలని సూచించారు. కాకినాడ రూరల్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో శనివారం పీజీఆర్‌ఎస్‌కు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. ఆదివారం రాత్రి 11 గంటలకు నూకరాజు వాట్సాప్‌ మెసేజ్‌లు పెట్టడంతో పంచాయతీరాజ్‌ సిబ్బంది ఆయన వద్దకు రీచ్‌ అయ్యేందుకు ప్రయత్నించారన్నారు. కింద స్థాయి ఉద్యోగులు రెగ్యులర్‌గా ఎలా ఉంటున్నారో.. టెన్షన్‌లో ఉన్నారా అనేది గుర్తు పెట్టాలని, నూకరాజు ఉదంతం ఒక పాఠం లాంటిందన్నారు. ఆయన సమస్యను తమ దృష్టికి తీసుకువచ్చి ఉంటే కచ్చితంగా న్యాయం చేసేవారమన్నారు.

నేడు కాకినాడకు సాధిక్‌ ఖాన్‌

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పిఠాపురం పంచాయతీరాజ్‌ ఏఈ నూకరాజు కుటుంబం రాజమహేంద్రవరం వద్ద గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. షేక్‌ సాధిక్‌ ఖాన్‌ వేధింపుల కారణంగానే వారు ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్‌ లెటర్ల ఆధారంగా పోలీసులు గుర్తించారు. అప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ ఘటనకు ప్రధాన కారకుడిగా భావిస్తున్న షేక్‌ సాధిక్‌ ఖాన్‌ను పట్టుకునేందుకు రాజమహేంద్రవరం, కాకినాడ పోలీసులు జల్లెడ పట్టారు. అతను దేశం దాటి వెళ్లిపోకుండా ముందుగా పోలీసులు పాస్‌పోర్ట్‌ను సీజ్‌ చేశారు. అనంతరం అతను విదేశాల్లో ఎవరెవరిని సంప్రదిస్తున్నాడో కాల్‌ డేటా ఆధారంగా వివరాలు సేకరించారు. చివరికి శుక్రవారం సాయంత్రం నిందితుడిని మీరట్‌లో పట్టుకుని అక్కడి కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు ట్రాన్సిట్‌ వారెంట్‌పై అతన్ని కాకినాడకు తీసుకువస్తున్నారు.

రిమాండ్‌ ఖైదీ మృతి

కంబాలచెరువు: రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న ఆవుల శ్రీనివాస్‌ (55) శనివారం అనారోగ్యంతో మృతి చెందాడు. అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం బొయిగాపల్లికి చెందిన శ్రీనివాస్‌ను జగ్గంపేట పోలీసులు ఈ ఏడాది ఫిబ్రవరి 6న గంజాయి కేసులో అరెస్టు చేశారు. కోర్టు అతనికి రిమాండ్‌ విధించింది. శ్రీనివాస్‌కు పలు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఇదిలా ఉండగా తెల్లవారుజామున కడుపునొప్పి రావడంతో జైలు సిబ్బంది అతనిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతను అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందాడు. ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రత్నగిరి కిటకిట

అన్నవరం: స్థానిక శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయానికి శ్రావణ శుద్ధ దశమి, శనివారం సందర్భంగా వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. క్యూలైన్లు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారి సన్నిధికి విచ్చేశారు. రెండు వేల సత్యదేవుని వ్రతాలు జరిగాయి. దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. సుమారు ఐదు వేల మందికి అన్నదానంలో భోజనం పెట్టారు. ఉదయం సత్యదేవుడు అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు పల్లకీ సేవ నిర్వహించారు. ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తూర్పురాజగోపురం లోపల ప్రాకారంలోకి ఊరేగింపుగా తీసుకువచ్చారు. పూజలు చేసి పల్లకీ సేవ ప్రారంభించారు.

పోక్సో చట్టంపై

అవగాహన అవసరం

ధవళేశ్వరం: మహిళలు, చిన్నారులకు పోక్సో చట్టంపై అవగాహన పెంచాలని రాజమహేంద్రవరం ప్రిన్సిపల్‌ సివిల్‌ జడ్జి రెడ్డిప్రసన్న సూచించారు. ధవళేశ్వరం పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ గణేష్‌ నేతృత్వంలో శనివారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాల, ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికోన్నత పాఠశాలలో బాలికలకు చట్టాలు, పోక్సో యాక్ట్‌, ఇతర అంశాలపై అవగాహన కల్పించారు. దీనికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రిన్సిపల్‌ సివిల్‌ జడ్జి రెడ్డి ప్రసన్న మాట్లాడుతూ చదువుకునే దశలో పిల్లలు పాటించాల్సిన నియమాలు, అపరిచిత వ్యక్తులతో ప్రవర్తించాల్సిన తీరు, ఈవ్‌టీజింగ్‌, గంజాయి వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరించారు. ధవళేశ్వరం పీఎస్‌ ఎస్సై హరిబాబు మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement