ముంచెత్తే..! | - | Sakshi
Sakshi News home page

ముంచెత్తే..!

Aug 22 2026 12:18 AM | Updated on Aug 22 2026 12:18 AM

పేరుకే స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర

జిల్లాలో ఎక్కడ చూసినా అపరిశుభ్రతే

నిరుపయోగంగా

చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు

పిఠాపురం: పన్నులు పంచాయతీలకు... చెత్త ప్రజలకు అన్నట్టుంది వాస్తవ పరిస్థితులు. జిల్లాలో ఏ పల్లె చూసినా చెత్త సమస్యతో కనిపిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర పేరుతో ఎంతో అట్టహాసంగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెబుతున్నా, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. జిల్లాలో మొత్తం 385 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సుమారు 4,85,089 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఆయా పంచాయతీల నుంచి రోజుకు సుమారు 50 టన్నుల చెత్త వస్తోంది. అయినా వీటి తరలింపు మాత్రం ప్రహసనంలా మారుతోంది.

నాడు అట్టహాసం.. నేడు అధ్వానం

గత ప్రభుత్వంలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు నిర్మితమై, పంచాయతీలకు బాసటగా నిలిచాయి. అక్కడ తయారైన సేంద్రియ ఎరువులతో పంచాయతీలకు ఆదాయం సమకూరేది. చెత్త సమస్య తీరేది. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. చెత్త నుంచి సంపద తయారు చేయడానికి రూ.కోట్లతో నిర్మించిన ఆ కేంద్రాలు ప్రస్తుతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయాయి. ఇవి అనేక చోట్ల నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేక కొన్ని గ్రామాల్లో మందుబాబులకు అడ్డాలుగా మారాయి. అనేకచోట్ల చెత్త నుంచి సంపద తయారు చేస్తున్నామని అధికారులు చెబుతున్నా, అనేక కేంద్రాల్లో ఎరువుల తయారీ అరకొరగానే సాగుతోంది. దీంతో పల్లెల్లో ఎక్కడబడితే అక్కడ చెత్త సమస్య తాండవిస్తోంది.

డంపింగ్‌ యార్డులు లేక..

జిల్లాలో మొత్తం 385 గ్రామ పంచాయతీలు ఉండగా, సగానికి పైగా పంచాయతీలకు డంపింగ్‌ యార్డులు లేవు. దీనివల్ల చెత్తను రోడ్లపైనే పోసి ఆయా పంచాయతీల సిబ్బంది చేతులు దులుపుకొంటున్నారు. దీనివల్ల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. నెలలో ఒకటి రెండు సార్లు చెత్తను తగలబెడుతుండటంతో వాయు కాలుష్యం ఏర్పడుతుంది. పొగ కారణంగా అటుగా వెళ్లే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.

అధికారుల పర్యవేక్షణా లోపం

గ్రామాల్లో రోజూ గ్రీన్‌ అంబాసిడర్లు ఇంటింటికీ వెళ్లి సేకరించిన తడి, పొడి చెత్తతో పాటు వీధుల్లో పేరుకుపోయిన చెత్తను రిక్షాల ద్వారా చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు తరలించాలి. అక్కడ తడి, పొడి చెత్తను వేర్వేరుగా కుండీల్లో వేసి వర్మీకంపోస్టు, సేంద్రియ ఎరువు తయారు చేసి రైతులకు తక్కువ ధరకు విక్రయించడం, అలాగే ప్లాస్టిక్‌ వ్యర్థాలను స్క్రాప్‌ దుకాణాలకు విక్రయించి పంచాయతీలకు అదనపు ఆదాయం సమకూర్చాలన్నదే ఈ కేంద్రాల లక్ష్యం. అయితే అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడడంతో ఈ కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది.

దృష్టి పెట్టక.. చెత్త వీడక

పలు పంచాయతీల్లో పారిశుధ్యం పూర్తిగా క్షీణిస్తోంది. శివారు గ్రామాల్లో పారిశుధ్య పనులు అసలు జరగడం లేదని స్థానికులు అంటున్నారు. వివిధ గ్రామాల్లో ఎక్కడ చూసినా చెత్తే కనిపిస్తోంది. యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ, వాకతిప్ప, అమీనాబాద్‌, కొత్తపల్లి, కొమరగిరి, గొల్లప్రోలు మండలం చేబ్రోలు, వన్నెపూడి, చిన్న జగ్గంపేట, దుర్గాడ,చెందుర్తి, తాటిపర్తి, పిఠాపురం మండలంలో గోకివాడ, మాధవపురం, చిత్రాడ, విరవాడ, మంగితుర్తి తదితర గ్రామాల్లో పారిశుధ్య సమస్య తీవ్రంగా ఉంది. అయినా పంచాయతీల్లో సిబ్బంది కొరత, అధికారుల ఉదాశీనత వెరసి ఇబ్బందిగా మారింది. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఎంతైనాఉంది.

ఆర్భాటానికే కార్యక్రమం

స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు ఆర్భాటానికేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కార్యక్రమాలకు మొదట్లో కొన్ని నిధులు విడుదల అయినప్పటికీ ఆ తర్వాత కాలం నుంచి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. తూతూ మంత్రంగా మాత్రమే ఈ కార్యక్రమాలను అమలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇంకోవైపు ఆర్థిక సంఘాల నిధులు ఖర్చుపై ఆంక్షలు విధించడం, ఉన్న కాస్త సాధారణ నిధులు అభివృద్ధి పనులకు సైతం సరిపోకపోవడం వంటి అనేక కారణాలతో పల్లెల్లో పారిశుధ్య సమస్య వస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement