కొనసాగిన జూడాల నిరసన | - | Sakshi
Sakshi News home page

కొనసాగిన జూడాల నిరసన

Aug 22 2026 12:18 AM | Updated on Aug 22 2026 12:18 AM

కాకినాడ క్రైం: జూనియర్‌ డాక్టర్ల నిరసన పదో రోజు శుక్రవారం కొనసాగింది. కాకినాడ జీజీహెచ్‌ ఎదురుగా ఉన్న పీజీ వసతి గృహ ఆవరణలో 600 మంది జూనియర్‌ డాక్టర్లు నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్ట్రైఫండ్‌ 15 నుంచి 30 శాతం పెంచాలని, వైద్యుల పదోన్నతి వయసు 65 ఏళ్లకు పెంచాలన్న నిర్ణయాన్ని విరమించుకోవాలని, ఎండీ, ఎంఎస్‌లు చేసిన వైద్యులకే అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకాల్లో తొలి ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించే వరకు పోరాడతామని తెలిపారు.

స్థానిక ఎన్నికల్లో

వైఎస్సార్‌ సీపీ జెండా ఎగరాలి

పార్టీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు పిలుపు

రాజమహేంద్రవరం రూరల్‌: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్‌ సీపీ జెండా ఎగురవేసేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి, రూరల్‌ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా చెల్లుబోయిన వేణును పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో పార్టీ శ్రేణులు శుక్రవారం బొమ్మూరులోని పార్టీ కార్యాలయానికి చేరుకుని ఆయన్ని పుష్ఫగుచ్చాలు, శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. కేఆర్‌జే రాజేష్‌ మిత్ర బృందం హుకుంపేట డీబ్లాకు తదితర ప్రాంతాల నుంచి భారీ బైక్‌ ర్యాలీగా వచ్చి వేణును సన్మానించారు. కొంతమూరు నుంచి వైఎస్సార్‌ సీపీ మెనార్టీ సెల్‌ అధికార ప్రతినిధి ఎంఎం అలీ, నియోజకవర్గ పంచాయతీరాజ్‌ విభాగ అధ్యక్షుడు చెరుకూరి సత్యనారాయణలతో కలసి వచ్చి వేణును సత్కరించారు. పార్టీ మైనార్టీ సెల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు షేక్‌ హమీద్‌ బాషా, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ షేక్‌ నిజాముద్దీన్‌, ధవళేశ్వరం గ్రామానికి చెందిన పార్టీ నేత మెండా రాజేష్‌ మిత్ర బృందం, దామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన దళిత నేతలు వచ్చి వేణుకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. చంద్రబాబు ప్రభుత్వం బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడిచిందన్నారు. ప్రభుత్వం మోసాలను ప్రజలకు వివరించాలన్నారు.

‘సర్‌’పై నేడు, రేపు ప్రత్యేక ప్రచార దినాలు

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఓటర్ల జాబితా స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌–2026లో భాగంగా శని, ఆదివారాల్లో జిల్లాలో ప్రత్యేక ప్రచార దినాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కీర్తి చేకూరి శుక్రవారం తెలిపారు. అర్హులను ఓటరుగా నమోదు చేయడం, ఓటర్ల జాబితాలోని వివరాలను పరిశీలించడం, ఓటర్ల వివరాల్లో తప్పులు ఉంటే సరిచేయడం వంటివి చేపడుతున్నామని తెలిపారు. జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బూత్‌ స్థాయి అధికారులు తప్పనిసరిగా అందుబాటులో ఉండి ఓటర్ల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించారు. స్వీకరించిన దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిశీలించి, జాప్యం లేకుండా ఆన్‌లైన్‌ చేయాలని ఆదేశించారు. ఆ రోజుల్లో ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యే సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు.

అంతర్వేదిలో

సామూహిక వ్రతాలు

సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో శ్రావణ మాసం రెండో శుక్రవారం పురస్కరించుకుని దేవస్థానం ఆధ్వర్యంలో సా మూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. ఆల య ఈవో ఎంకేటీఎన్‌వీ ప్రసాద్‌ పర్యవేక్షణలో ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్‌ ఆధ్వర్యంలో వింజమూరి రామరంగాచార్యులు, అర్చకులు వరలక్ష్మీ వ్రతాలు చేయించారు. ఈ సందర్భంగా 400 మంది మహిళలు సామూహికంగా కుంకుమ పూజలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement