జూడాల రిలే నిరాహార దీక్ష | - | Sakshi
Sakshi News home page

జూడాల రిలే నిరాహార దీక్ష

Aug 15 2026 12:22 AM | Updated on Aug 15 2026 12:22 AM

కాకినాడ క్రైం: స్థానిక వైద్య విద్యార్థుల పీజీ వసతి గృహం ఆవరణలో జూనియర్‌ డాక్టర్లు (జూడా) మూడో రోజైన శుక్రవారం కూడా రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. స్టైపెండ్‌ పెంచాలని, ఉద్యోగ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచడానికి వీల్లేదని, ఉద్యోగ నియామకాల్లో ఎండీ, ఎంఎస్‌ చదివిన అభ్యర్థులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం జీజీహెచ్‌లో అత్యవసర సేవలు మినహా మిగిలిన సేవల్ని జూడాలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 16 నుంచి పూర్తి స్థాయిలో సేవల నిలుపుదలకు జూడాల అసోసియేషన్‌ నాయకులు పిలుపునిచ్చారు.

ప్రేమను నిరాకరించిందని

యువకుడి ఆత్మహత్య

కరప: తన ప్రేమను ఓ యువతి నిరాకరించిందన్న బాధతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరప మండలం గురజనాపల్లిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఆ గ్రామానికి చెందిన అడ్డూరి సూర్య (21) కాకినాడలోని ఒక గ్యాస్‌ కంపెనీలో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. అతడికి తల్లి, సోదరుడు ఉన్నారు. సూర్య తండ్రి నానాజీ 15 ఏళ్ల క్రితమే మృతి చెందగా కూలి పనులు చేసుకుంటూ ఒకరికొకరు చేదోడువాదోడుగా జీవిస్తున్నారు. కొంత కాలం క్రితం ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయమైన వేరే గ్రామానికి చెందిన యువతిని సూర్య ప్రేమిస్తున్నాడు. అయితే, ఆ అమ్మాయి శ్రీనిన్ను ప్రేమించడం లేదు. నువ్వు నాకు సోదరుడివవుతావుశ్రీ అని చెప్పింది. దీంతో, మనస్తాపం చెందిన సూర్య గురువారం రాత్రి క్షణికావేశంలో తన ఇంటి ఎదురుగా ఉన్న వేపచెట్టుకు ఉరి వేసుకున్నాడు. కుటుంబ సభ్యులు వెంటనే కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి సోదరుడు అనిల్‌ శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్సై వెంకట రమణ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం సూర్య మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

నిధులు సమకూర్చుకుంటూ సమస్యల పరిష్కారం

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): దశలవారీగా నిధులు సమకూర్చుంటూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పురపాలక శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి పి.నారాయణ అన్నారు. కలెక్టరేట్‌లోని వివేకానంద సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన జిల్లా సమీక్షా కమిటీ (డీఆర్‌సీ) సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ముఖ్యమంత్రితో సంప్రదించి, పంటల బీమా గడువు పెంచేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. ఎల్‌ నినో ప్రభావం నేపథ్యంలో వ్యవసాయ, జలవనరుల శాఖలు పూర్తి సమన్వయంతో పంటలను కాపాడాలని సూచించారు. ముద్రా, తదితర రుణాల కల్పనపై బ్యాంకర్లతో రుణమేళా ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు సానా సతీష్‌బాబు సూచించారు. పోలవరం ఎడమ కాలువ వెంబడి ఖాళీగా ఉన్న వరద కరకట్ట స్థలాలను ఇళ్ల స్థలాలకు కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కోరారు. దీనివల్ల భూసేకరణ నిధులు ఆదా అవుతాయని అన్నారు. జగ్గంపేట సీహెచ్‌సీలో ఎముకల వైద్య నిపుణులను నియమించాలని కోరారు. ఇటీవల కామెర్ల వ్యాధితో పెద్దాపురం ప్రజలు భయాందోళనలకు గురయ్యారని, ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. కాకినాడ జీజీహెచ్‌లో కార్డియాలజిను నియమించాలని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కోరారు. ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిర ప్రసాద్‌ అన్నారు. కార్యక్రమంలో కాకినాడ రూరల్‌, తుని ఎమ్మెల్యేలు పంతం నానాజీ, యనమల దివ్య, డీసీసీబీ చైర్మన్‌ తుమ్మల బాబు కూడా పాల్గొన్నారు.

సముద్రంలోకి

1.47 లక్షల క్యూసెక్కులు

ధవళేశ్వరం: కాటన్‌ బ్యారేజీ నుంచి శుక్రవారం 1,47,180 క్యూసెక్కుల గోదావరి మిగులు జలాలను సముద్రంలోకి విడిచి పెట్టారు. తూర్పు డెల్టాకు 5 వేలు, మధ్య డెల్టాకు 2,600, పశ్చిమ డెల్టాకు 7 వేలు కలిపి, డెల్టా కాలువలకు 14,600 క్యూసెక్కు ల నీటిని విడుదల చేశారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.90 అడుగులుంది. ఎగువన కాళేశ్వరంలో 6.09 మీటర్లు, పేరూరు 9.44, దుమ్ముగూడెం 7.05 మీటర్లు, భద్రాచలం 20.80 అడుగులు, కూనవరం 9.07 మీటర్లు, కుంట 4.85, పోలవరం 6.25, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 14.04 మీటర్లుగా నీటిమట్టాలు నమోదయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement