కరప: గుర్రపుడెక్కతో డ్వాక్రా మహిళలు స్వయం ఉపాధి పొందవచ్చని కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ అన్నారు. డీఆర్‌డీఏ, సెర్ప్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యాన కరప, కాజులూరు మండలాల్లోని 40 మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు కరప మండలం గొర్రిపూడి గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాలువల్లో నీటి ప్రవాహానికి ఆటంకంగా మారుతున్న గుర్రపుడెక్కను ఎండబెట్టి, దానితో వివిధ వస్తువులు, కళాకృతులు తయారు చేసి లబ్ధి పొందేలా ఈ శిక్షణ ఏర్పాటు చేశామని చెప్పారు. గుర్రపుడెక్క దొరకని సమయంలో జూట్, ప్లాస్టిక్ బ్యాగులు తయారు చేసేలా మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని చెప్పారు. డ్వాక్రా మహిళలు తయారు చేసే వస్తువుల మార్కెటింగ్‌కు చర్యలు తీసుకుంటామన్నారు. ‘స్వయం’ అనే బ్రాండ్ ద్వారా ఈ వస్తువుల విక్రయానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తోందని తెలిపారు. ఈ ఉత్పత్తులను అమెజాన్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో విక్రయించడం ద్వారా దేశవ్యాప్తంగా 10 వేలకు పైగా ప్రాంతాలకు గ్రామాల నుంచే వస్తువులను పంపిణీ చేసే అవకాశం ఉంటుందని వివరించారు. బ్యాగుల తయారీకి అవసరమైన ఫోల్డింగ్, ప్రెస్సింగ్ మెషీన్ల వంటి ఉపకరణాలను సబ్సిడీపై అందించేందుకు ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ చెప్పారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ ప్రియ, డీఆర్‌డీఏ పీడీ జి.శ్రీనివాసరావు, డీపీఎం టి.బాబూరావు, తహసీల్దార్ ఏఎల్ లక్ష్మి, ఎంపీడీఓ జె.శ్రీనివాస్, ఏపీఎం ఎన్.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


