మువ్వన్నెల వేడుకలకు ముస్తాబు | - | Sakshi
Sakshi News home page

మువ్వన్నెల వేడుకలకు ముస్తాబు

Aug 15 2026 12:22 AM | Updated on Aug 15 2026 12:22 AM

కాకినాడ క్రైం: స్వాతంత్య్ర దినోత్సవానికి జిల్లా ముసాబైంది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు త్రివర్ణ కాంతులను అద్దుకున్నాయి. రైల్వే స్టేషన్‌, బస్టాండ్‌, జీజీహెచ్‌, కలెక్టరేట్‌, ఎస్పీ, ఆర్‌టీఏ సహా పలు జిల్లా స్థాయి కార్యాలయాలు పంద్రాగస్టు వేడుకలకు సిద్ధమయ్యాయి. కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిర ప్రసాద్‌ ఆధ్వర్యాన ఎస్పీ బిందుమాధవ్‌ భద్రతా పర్యవేక్షణలో కాకినాడలోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో జిల్లా స్థాయి వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 9 గంటలకు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసు దళాల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆయన ప్రసంగం అనంతరం పోలీస్‌ కవాతు, ప్రగతి శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉత్తమ ప్రతిభ చూపిన అధికారులు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేస్తారు. ఎస్పీ బిందుమాధవ్‌ ఆధ్వర్యాన శుక్రవారం వేడుకల రిహార్సల్స్‌ నిర్వహించారు. ఎస్పీ కార్యాలయం నుంచి భానుగుడి సెంటర్‌ వరకూ జరిగిన ర్యాలీలో విద్యార్థులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. తన కార్యాలయ ఆవరణలో ఆర్‌డీవో మల్లిబాబు చొరవతో ఏర్పాటు చేసిన వందేమాతరం జాతీయ గీతం తెలుగు భావానువాదం ఎంతో ఆకట్టుకుంది.

ట్రాఫిక్‌ ఆంక్షలు

పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో పోలీస్‌ పరేడ్‌ మైదానం రోడ్డులో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. భారీ వాహనాలను మళ్లిస్తున్నారు. వేడుకల పేరుతో రోడ్లపై వాహనాల ప్రయాణాలకు ఆటంకం కలిగించేలా ఎటువంటి కార్యక్రమాలూ నిర్వహించరాదని, ద్విచక్ర వాహనాలపై జెండాలు ప్రదర్శిస్తూ మితిమీరిన వేగంతో వెళ్లడాన్ని సహించబోమని పోలీసులు హెచ్చరించారు. మద్యం తాగి వాహనాలు నడపడం, ఇతర ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

అవార్డులకు కత్తెర

ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆరోగ్య పరిస్థితి, భద్రతా కారణాలతో ఉత్తమ సేవల అవార్డులకు అధికారులు కత్తెర వేశారు. ఒక్కో ప్రభుత్వ విభాగం నుంచి తొలుత 5 నుంచి 10 మంది వరకూ ఎంపిక చేయగా.. శుక్రవారం సాయంత్రానికి దీనిని ముగ్గురి నుంచి ఐదుగురికి పరిమితం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement