ఘనంగా సత్యదేవుని జయంత్యుత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా సత్యదేవుని జయంత్యుత్సవం

Aug 15 2026 12:22 AM | Updated on Aug 15 2026 12:22 AM

అన్నవరం: పవిత్ర శ్రావణ మాసం తొలి శుక్రవారం.. అందునా సత్యదేవుని 136వ జయంత్యుత్సవం కావడంతో రత్నగిరి నూతన శోభను సంతరించుకుంది. సత్యదేవుని జన్మ నక్షత్రం మఖ సందర్భంగా తెల్లవారుజామున రెండు గంటలకు ఆలయం తెరచి, పూజలు చేశారు. స్వామి, అమ్మవార్లతో పాటు శంకరుని మూలవిరాట్టులకు పంచామృతాలతో మహాన్యాస పూర్వక అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను నూతన పట్టు వస్త్రాలతో, స్వర్ణ, వజ్రకర్ణాభరణాలతో, సుగంధభరిత పుష్పాలతో అలంకరించి పూజించారు. ఉదయం 6 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. ఉదయం పది గంటలకు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని వెండి రథంపై ఘనంగా ఊరేగించారు. 11 గంటలకు నిర్వహించిన ఆయుష్య హోమం పూర్ణాహుతిలో దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌, ఈఓ నల్లం సూర్యచక్రధరరావు, ట్రస్ట్‌ బోర్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా 19 మంది పండితులను దేవస్థానం చైర్మన్‌, ఈవో ఘనంగా సత్కరించారు. కార్యక్రమాలను దేవస్థానం వేద పండితులు గంగాధరభట్ల గంగబాబు, చిట్టి శివ, గొల్లపల్లి ఘనపాఠి తదితరులు నిర్వహించారు. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వ్రతాలు 2,500 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. సత్యదేవుని అన్నప్రసాదాన్ని సుమారు 5 వేల మంది భక్తులు స్వీకరించారు. సత్యదేవుని జయంత్యుత్సవం సందర్భంగా ప్రధానాలయాన్ని, ద్వారాలను ఫలపుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించారు.

స్వామి, అమ్మవార్లకు పూజలు చేస్తున్న పండితులు. చిత్రంలో దేవస్థానం చైర్మన్‌, ఈఓ తదితరులు

ఆలయం వద్ద ఫలపుష్పాలతో చేసిన అలంకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement