పిఠాపురం: ఒక్క ఎకరం కూడా ఎండనివ్వం.. అన్ని భూములకూ సాగు నీరందిస్తాం.. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకి 1000 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తాం.. అంటూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పిన మాటలు నీటి మూటలే అయ్యాయి. చుక్క నీరు రాక ఏలేరు ఆయకట్టు ప్రాంతం ఎండిపోతోంది. ఆయకట్టులో 9 వేల ఎకరాల్లో నాట్లు పడలేదు. బోరు నీటితో వేసిన నారుమళ్ళు, నాట్లు ఎండిపోతున్నాయి. దీంతో అన్నదాతలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఒకవైపు ఏలేరు, మరోవైపు గోదావరి జలాలను అందిస్తున్నామని అధికారులు, ప్రజాప్రతినిధులు ఆర్భాటంగా ప్రకటనలు చేశారు. నీరున్న కాలువల వద్ద అభిమానులు వారి నాయకుడికి క్షీరాభిషేకాలు చేశారు. తీరా చూస్తే ఈ ప్రాంతానికి ఇస్తామన్న 1000 క్యూసెక్కుల్లో ఇక్కడి చెరువులకు గత 10 రోజులుగా ఒక్క క్యూసెక్కు కూడా రాలేదని రైతులు వాపోతున్నారు.
ఎడారిలా కనిపిస్తున్న పంట భూములు
పిఠాపురం మండలం పి.దొంతమూరులోని గోపాలరాజు చెరువు, పి.రాయవరం చెరువుల కింద 9 వేల ఎకరాల ఆయకట్టు సందిగ్ధంలో పడింది. దొంతమూరు, వెల్దుర్తి, పి.తిమ్మాపురం, పి.రాయవరం, బి.కొత్తూరు, రాపర్తి, భోగాపురం, బి.ప్రత్తిపాడు తదితర గ్రామాలకు ఈ చెరువుల నుంచే సాగు నీరందుతోంది. వేలాది రైతులు ఇక్కడ పంటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పినట్లుగా పురుషోత్తపట్నం ఎత్తిపోతల నుంచి నీరయినా ఇస్తారేమోనని ఎదురు చూసినా, వారి ఆశ నిరాశే అయింది. రోజులు గడుస్తున్నా చెరువుల్లోకి నీరు రాలేదు. కిర్లంపూడి నుంచి వచ్చే నీరు కూడా రావడంలేదు. ఏలేరు, గోదావరి జలాలను వంతులవారీగా ఇస్తున్నామని అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రకటించడంతో ఎంతో ఆశతో పంటల సాగుకు సన్నద్ధమయ్యామని, కానీ ఒక్క క్యూసెక్కు కూడా నీరు రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగు నీరు ఆలస్యమైతే ఆకుమడి ముదిరి, నాట్లకు పనికిరాకుండా పోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మా చెరువులోకి నీరు ఎప్పుడు వస్తుందో చెప్పండని రైతులు అధికారులను వేడుకొంటున్నారు.
అడుగంటిన పిఠాపురం మండలం
రాయవరం చెరువు
పిఠాపురం మండలం వెల్దుర్తిలో
నీరు లేక ఆరిపోయిన వరి చేలు
ఫ డిప్యూటీ సీఎం ఇలాకాలో
ఎండుతున్న పొలాలు
ఫ పురుషోత్తపట్నం నుంచి
వెయ్యి క్యూసెక్కులు ఇస్తామన్న పవన్
ఫ ఒక్క క్యూసెక్కు కూడా
రాలేదంటున్న రైతులు
ఫ ఏలేరు ఆయకట్టులో 9 వేల ఎకరాలకు సాగునీటి గండం
ఫ ఆకుమడి ముదిరితే సాగుకు
పనికిరాదంటున్న అన్నదాతలు
ఫ ఏలేరు జలాలు ఎటు వెళ్లాయో
చెప్పాలంటున్న రైతులు
ఇంత దారుణం ఎప్పుడూ చూడలేదు
నీటిని విడుదల చేశామని అధికారులు చెబుతున్నారు. కానీ చుక్క నీరు రాలేదు. అడుగుదామంటే ఏ అధికారీ కనిపించరు. చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నాను. ఇలాంటి దారుణ పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు. వర్షాలు లేకపోయినా ప్రాజెక్టు నుంచి నీరు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఇస్తున్నామని చెప్పి.. ఆకుమడులు వేసుకోమని.. నీరివ్వడం లేదు.
– ఎడ్ల పైడియ్య, రైతు, పి.తిమ్మాపురం,
పిఠాపురం మండలం
నారుమళ్లు,
నాట్లు ఎండిపోతున్నాయి
పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకు 1,000 క్యూసెక్కుల నీరు వస్తుందన్నారు. ఉప ముఖ్యమంత్రి ఆదేశాలు అన్నారు. కానీ ఎక్కడా నీరు వచ్చిన ఆనవాళ్లు లేవు. చెరువులు ఎండిపోతున్నాయి. బోర్ల ద్వారా ఆకుమడులు వేసుకుంటే కరెంటు లేక నారుమళ్లు ఎండిపోతున్నాయి. ఆయకట్టు పరిధిలోని చెరువులకు నీరు చేరేలా చర్యలు తీసుకోవాలి.
– గుండ్ర బాబ్జి, రైతు,
పి.దొంతమూరు, పిఠాపురం మండలం


