● బంగారు ఆభరణాల అపహరణ
● నిందితుల్లో ఒకరిని
అదుపులోకి తీసుకున్న పోలీసులు
● మరో ఇద్దరు పరారీ
కరప: రూ.10 వేల పింఛన్ మంజూరు చేయిస్తామని ఆశచూపించి, ఓ వృద్ధురాలి నుంచి బంగారు ఆభరణాలు అపహరించి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలం గొర్రిపూడి గ్రామంలో ఈనెల 8న జరిగిన ఈ మోసానికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. గొర్రిపూడిలోని పెదపుంతవీధిలో 70 ఏళ్ల వృద్ధురాలు ఎర్రంనీడి ఆంజనేయులమ్మ ఒక రేకులు షెడ్డులో ఒంటరిగా నివసిస్తోంది. ఆమెకు వివాహితులైన ఇద్దరు కుమార్తెలు వేరే గ్రామంలో ఉంటుండగా, ముగ్గురు కుమారులు సమీపంలోనే వేరేగా కాపురముంటున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 8న మధ్యాహ్నం ముగ్గురు వ్యక్తులు ఆమెను కలసి పింఛను వస్తోందా, రాకుంటే చెప్పండి సహాయం చేస్తామని నమ్మబలికారు. దీనికి ఆమె రూ.4 వేలు వస్తోందని చెప్పడంతో వారు రూ.10 వేలు పింఛను మంజూరు చేయిస్తామని ఆశ చూపి నమ్మబలికారు. వారి మాటలు నమ్మిన ఆమె వారు చెప్పినట్టు ధ్రువపత్రాలు అందజేసింది. ఫొటో తీయాలని ఇక్కడ సరిగా రావని, సమీపంలోని గుడికి వెళ్తామని తెలిపారు. మెడలోని బంగారు గొలుసు, చెవులకు ఉన్న బంగారు దుద్దులు తీసేసి, ఇంట్లో దాచుకోమని ఆమెకు నమ్మకం కలిగించారు. వారి మాటలు నమ్మిన ఆమె వాటిని తీసి ఇంట్లో భద్రపరిచింది. తర్వాత వారి మోటార్ సైకిల్‌పై ఎక్కగా ఆమెను తీసుకెళ్లిన వెంటనే వారిలోని ఒకడు ఇంట్లోకి వెళ్లి దాచిపెట్టిన బంగారు ఆభరణాలు అపహరించి, ఏమీ తెలియనట్టు కూర్చున్నాడు. మోసగాళ్లు ఆమెను ఇంటివద్ద దింపేసి, పరారయ్యారు. వృద్ధురాలు ఇంటిలోకి వెళ్లి చూడగా బంగారు ఆభరణాలు కనపడలేదు. దీంతో మోసపోయినట్టు గ్రహించిన ఆమె విషయాన్ని బంధువులకు వివరించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్లో ఒకడు మైనర్, ఒకడు పాత నేరస్తుడు ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. వారిలో ఒకరిని పట్టుకోగా, మిగిలిన ఇద్దరూ పరారీలో ఉన్నట్టు ఎస్‌ఐ తోట సునీత తెలిపారు.


