కాకినాడ రూరల్: రాష్ట్ర మత్స్య సాంకేతిక సంస్థ (ఎస్‌ఐఎఫ్‌టీ)లో ఆక్వా సాగులో ఆరోగ్య నిర్వహణ, జీవ భద్రత ప్రమాణాలు అనే అంశంపై మూడు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించారు. శ్రీకాకుళం, పి.మన్యం, విశాఖపట్నం, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల ఆక్వా రైతులు, హేచరీల ఆపరేటర్లు ఈ శిక్షణలో పాల్గొన్నారు. జీవ భద్రత ప్రాముఖ్యతపై అవగాహన, నీటి నాణ్యత, మైక్రోబయాలజీ, పీసీఆర్ పరీక్షల ప్రత్యక్ష పరిశీలన, చేపలు, రొయ్యల్లో వచ్చే వైరల్, బ్యాక్టిరియల్ వ్యాధుల నివారణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. శిక్షణలో భాగంగా తాళ్లరేవు మండలలోని పాలి కల్చర్, రొయ్యల సాగు క్షేత్రాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. చివరి రోజు బుధవారం శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.అంజలి సర్టిఫికెట్లను అందజేశారు. డాక్టరు సుధాకర్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ రాజ్‌కుమార్, సప్తగిరి హేచరీస్ జీఎం డాక్టరు మురళీధర్, సైంటిస్ట్ పి.అందే, డాక్టరు వీరాంజనేయులు, రామ్మోహనరావు, ఏడీఎఫ్ శ్రావణికుమారి, ఎఫ్‌డీఓ రీనా తదితరులు శిక్షణ ఇచ్చారు.
వీఆర్‌ఏల సమస్యలు
పరిష్కరించాలి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ప్రభుత్వం వీఆర్‌ఏలను చిన్నచూపు చూస్తోందని ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘ జిల్లా అధ్యక్షులు నిడమర్తి సురేష్ ఇజ్రాయిల్ మండిపడ్డారు. సంఘ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు బుధవారం కలెక్టరేట్ వద్ద మహా ధర్నా నిర్వహించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ పార్ట్ టైం ఉద్యోగులైన వారిని 24 గంటలూ వినియోగించుకుంటూ జీతాలు మాత్రం పెంచడంలేదన్నారు. అర్హులకు పదోన్నతులు ఇవ్వడం లేదని, అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని, అది జరిగి రెండేళ్లు గడుస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. జిల్లా కార్యదర్శి గెడ్డం చినబాబూజీ, కాకినాడ డివిజన్ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, పెద్దాపురం డివిజన్ అధ్యక్షుడు ఇ.వీరబాబు మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించకుంటే సీఎం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లాలోని అన్ని మండలాల వీఆర్‌ఏ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.


