అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని ఆలయంలో మెట్ట ప్రాంతానికి చెందిన ఓ ట్రస్ట్‌బోర్డు సభ్యుడు, మరో సభ్యురాలి వీరంగం స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. వివరాల్లోకి వెళితే గత ఏప్రిల్ 16న ఐవీ రోహిత్ చైర్మన్‌గా 15 మందితో ఏర్పాటైన ట్రస్ట్ బోర్డుకు తోడు మరో ఆరుగురు సలహాదారులను నియమించారు. ప్రతినెలా వీరు సమావేశమై ఈఓ అందజేసే అజెండాపై చర్చించి తీర్మానాలు చేయాల్సి ఉంటుంది. కాగా ఈ సమావేశాల్లో వారు దేవస్థానానికి సలహాలు ఇవ్వడం తప్ప చర్యలు తీసుకునే పరిస్థితి ఉండదు. కానీ సదరు మెట్ట ప్రాంత సభ్యుడు తానే సర్వాధికారినన్నట్టు వ్యవహరిస్తున్నారు.
పురోహితుని క్రమశిక్షణ చర్యల
‘పాక్షిక రద్దు’తో ‘వీర’ంగం మొదలు:
దేవస్థానం వ్రత పురోహితునిపై వచ్చిన ఫిర్యాదుల మేరకు గత ఏడాది డిసెంబర్‌లో, ఆ తరువాత పొరపాట్లు చేసి ఆధారాలతో దొరకిన విషయం తెలిసిందే. అప్పటి ఈఓ గత మార్చిలో అతనికి రెండు ఇంక్రిమెంట్లు కట్‌చేసి, వ్రతకథ చెప్పకుండా ఉండేలా ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాలను ఉపసంహరించేలా సదరు బోర్డు సభ్యుడు, మరో సభ్యురాలు చక్రం తిప్పి ఇతర సభ్యులపై ఒత్తిడి తెచ్చి తీర్మానం చేయించారు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో ఆగ్రహం వ్యక్తం చేసి ఆ తీర్మానాన్ని సస్పెండ్ చేశారు.
చప్పట్లు కొడితే బాబు.. చిటికేస్తే చినబాబు
ఈ వ్యవహారంపైనా సదరు సభ్యుడు నా గురించి ఏమంటుకుంటున్నారు? నేను చప్పట్లు కొడితే బాబు, చిటికేస్తే చినబాబు లైన్‌లోకి వస్తారు. మీకు చాత కాకపోతే చెప్పండి నేను చూస్కుంటా అంటున్న కబుర్లు విని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇదే మాటలు సాక్షాత్తు దేవదాయ శాఖ కీలక అధికారి వద్ద కూడా ప్రస్తావించడంతో ఆయన సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గత నెలలో దేవస్థానం పర్యటనకు వచ్చిన సదరు అధికారిని బోర్డు సభ్యులు కలసి పరిస్థితిని వివరించారు. ఈ సమావేశంలో పాల్గొన్న సదరు సభ్యుడు కూడా ఉండి దేవస్థానానికి రెగ్యులర్ ఈఓను వేయండి అని అడిగారు. దీంతో సదరు అధికారి చూద్దాం అనగానే మీ స్థాయిలో కాకపోతే చెప్పండి నేను సీఎంతో మాట్లాడతా అనగానే ఆయన కోపాన్ని నిగ్రహించుకుని నేను మాట్లాడతా అని బదులిచ్చి ఊరుకున్నారు.
వ్యాపారులపైనా అదే తంతు
దేవస్థానంలోని వ్యాపారాలు సక్రమంగా సాగుతున్నదీ లేనిదీ కేవలం పరిశీలించాల్సి ఉంటుంది. కానీ సదరు ట్రస్ట్ బోర్డు సభ్యుడు, ఆయనకు వత్తాసు పలుకుతున్న సభ్యురాలు ఆయా దుకాణాల వద్దకు వెళ్లి వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వ్యాపారులు సైతం వారి ఆగడాలను అడ్డుకుంటూ వారి పని వారు చూసుకుంటున్నారు. ఆ ఇద్దరు సభ్యుల ప్రవర్తనతో విసిగిపోయిన వ్యాపారులు స్థానిక ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యేను కలసి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన తాను వారిని పిలిపించి మాట్లాడతానని వ్యాపారులకు హామీ ఇచ్చారు.
సత్యదేవుని సన్నిధిలో
ట్రస్ట్ బోర్డు సభ్యుని ఆగడాలు
అన్నింటా తానే అంటూ
పెడసరపు వ్యవహారం
ఎమ్మెల్యేలకు ఫిర్యాదు చేసిన వ్యాపారులు


