రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది ఉద్యోగ భద్రత కోసం యూనివర్సిటీ ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజైన శుక్రవారం కూడా కొనసాగాయి. 20 ఏళ్ల నుంచి చాలీచాలని వేతనాలతో విధులు నిర్వర్తిస్తున్న తమ సర్వీసులను గుర్తించి, రెగ్యులర్ చేయాలని వారు డిమాండ్ చేశారు. అయితే ఈనెల ఒకటిన ఇందుకు విరుద్ధంగా జారీ చేసిన టెండర్ నోటీసును తక్షణమే రద్దు చేసి, తమకు న్యాయం చేయాలని కోరారు. అప్పటి వరకు ఈ దీక్షలను విరమించేది లేదని స్పష్టం చేశారు. వీరి దీక్షలకు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా సంఘీభావం తెలిపారు. సిబ్బంది సమస్యల పరిష్కరించే వరకూ తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని వారికి జక్కంపూడి భరోసా ఇచ్చారు.
సంఘీభావం తెలిపిన
మాజీ ఎమ్మెల్యే రాజా


