అన్నవరం: పంపా రిజర్వాయర్ కింద ఈ ఏడాది ఖరీఫ్ పంట సాగయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఆగస్టు ఐదో తేదీ వచ్చినా వరుణుడు కరుణించక పోవడంతో రైతుల ఆశలు అడుగంటుతున్నాయి. తుని, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో 12,500 ఎకరాలలో ఖరీఫ్ సాగవ్వాల్సి ఉండగా ఇప్పటికి కేవలం వెయ్యి ఎకరాలలో అది కూడా వ్యవసాయ బోర్లు ఉన్న చోట మాత్రమే వరినాట్లు పూర్తయ్యాయి. జూలై మూడో వారంలో పంపా రిజర్వాయర్ నీటిమట్టం 90 అడుగులు ఉండగా ఇప్పుడు ఆగస్టు ఐదో తేదీన కూడా అదే నీటిమట్టం ఉంది. రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టం 103 అడుగులు, అలాగే గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 0.43 టీఎంసీ కాగా ప్రస్తుతం 0.08 టీఎంసీలు మాత్రమే ఉంది. దీంతో ఈ ఏడాది ఖరీఫ్ సాగవ్వడం అనుమానమే అనే అభిప్రాయం బలపడుతోంది. ఒకవైపు వర్షాభావ పరిస్థితులు, మరో వైపు పంపాకు అవసరమైనప్పుడు నీరు అందించే పుష్కర ఎత్తిపోతల పథకం నుంచి ఈ సారి నీరు వచ్చే అవకాశం లేకపోవడం దీనికి బలం చేకూర్చుతోంది.
ఖరీఫ్ సాగవ్వాలంటే..
పంపా ఆయకట్టు కింద 12,500 ఎకరాలలో ఖరీఫ్ సాగవ్వాలంటే మూడు సార్లు పంపా నిండాల్సి ఉంటుంది. పంపాలో పూర్తి స్థాయిలో నీరు ఉంటే ఖరీఫ్‌లో సగం సీజన్ వరకు సరిపోయేది. ఆ తర్వాత పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని పంపాకు మళ్లించి ఖరీఫ్ సాగయ్యేలా చర్యలు తీసుకునేవారు. అది సాధ్యం కాకపోతే ఏలేరు రిజర్వాయర్ నుంచి నీటిని తరలించేవారు. ఇప్పుడు పుష్కర నీరు రావడం లేదు, అలాగే ఏలేరులో కూడా నీటి నిల్వలు కనిష్ట స్థాయిలోనే ఉన్నాయి.
చెత్తతో నిండిపోయిన కాలువలు
ఏటా ఈ సీజన్‌లో పంపా నుంచి ఖరీఫ్‌కు నీరు విడుదల చేసేవారు. దానితో పంపా కాలువలు నిండుగా కనిపించేవి. సత్యదేవుని ఆలయానికి విచ్చేసే భక్తులతో పాటు గ్రామస్తులు కూడా ఆ కాలువల్లో స్నానాలు చేసేవారు. కానీ నేడు నీరు ప్రవహించక కాలువలు చెత్త కుప్పలుగా మారాయి. కొందరు తమ ఇళ్లలోని చెత్తను తీసుకువచ్చి వాటిలో వేస్తున్నారు.
ఫ పంపా రిజర్వాయర్‌లో పెరగని నీటిమట్టం
ఫ వర్షాలు కురవక నిండని జలాశయం
ఫ ఆయకట్టు పరిధిలో ఈ ఖరీఫ్ లేనట్టే!
ఫ అన్నదాతల ఎదురుచూపులు


