అకుంఠిత దీక్షతో.. | - | Sakshi
Sakshi News home page

అకుంఠిత దీక్షతో..

Aug 7 2026 12:14 AM | Updated on Aug 7 2026 12:14 AM

డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌ సీపీ పోరు

జిల్లాలో రిలే నిరాహార దీక్షలు

భారీగా హాజరైన పార్టీ శ్రేణులు,

డీఎస్సీ అభ్యర్థులు

సాక్షి ప్రతినిధి, కాకినాడ: డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌ సీపీ పోరు ఉధృతం చేసింది. ఇప్పటికే రెండు దశల్లో నిరసనలు చేపట్టింది. తొలి దశలో అక్రమాలను వివరిస్తూ, రూపొందించిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్‌కు సమర్పించింది. అనంతరం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఆయా నియోజకవర్గాల కోఆర్డినేటర్ల ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు చేపట్టింది. తాజాగా వినూత్న నిరసనకు దిగింది. నిరాహార దీక్షలతో ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు గురువారం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్‌ సీపీ శ్రేణులు, డీఎస్సీ అభ్యర్థులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలు మరో మూడు రోజులు జరగనున్నాయి. ఈ సందర్భంగా అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్‌ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసింది. సీబీఐతో విచారణ జరిపించాలని కోరింది. నిరుద్యోగ యువత జీవితాలతో ఆటలు వద్దని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తోంది.

తుని: దగా డీఎస్సీకి ఆద్యుడైన నారా లోకేష్‌ తక్షణమే రాజీనామా చేయాలని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా డిమాండ్‌ చేశారు. తుని నియోజకవర్గం కోటనందూరులో నిర్వహించిన రిలే దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్‌తో కూటమి ప్రభుత్వం ఆటలాడుతోందన్నారు. నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తుంటే, ప్రభుత్వం జీర్ణించుకోలేక పోతోందన్నారు. దీక్ష శిబిరాలను సైతం తొలగించేందుకు కుట్రలు చేయడం దారుణమన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

జగ్గంపేట: జగ్గంపేట బస్టాండ్‌ ఎదురుగా వైఎస్సార్‌ విగ్రహం వద్ద డీఎస్సీ అక్రమాలను నిరసిస్తూ మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ తోట నరసింహం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టడం, 2 శాతం స్పోర్ట్స్‌ కోటాలో 417 మంది ఉద్యోగాలు పొందడంపై మండిపడ్డారు. వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట శ్రీరాంజీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒమ్మి రఘురాం, క్రిస్టియన్‌ మైనార్టీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జాన్‌ వెస్లీ తదితరులు పాల్గొన్నారు.

పెద్దాపురం: కూటమి ప్రభుత్వ విధానాలకు నిరసనగా సామర్లకోట స్టేషన్‌ సెంటర్లో రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ దవులూరి దొరబాబు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ డీఎస్సీలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని, నియామకాలపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్‌ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. శిబిరంలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అయ్యరక సంఘ అధ్యక్షుడు ఆవాల లక్ష్మీనారాయణ, సహాయ కార్యదర్శి ఉబా జాన్‌ మోజెస్‌, యువజన విభాగం రాష్ట్ర సహాయ కార్యదర్శి కర్ణం రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

పిఠాపురం: ఉప్పాడ బీచ్‌ రోడ్డు సెంటర్‌లో నియోజకవర్గ కో–ఆర్డినేటర్‌ వంగా గీత ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఇందులో పిఠాపురం నియోజకవర్గ పరిశీలకుడు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. విప్పర్తి మాట్లాడుతూ డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌ సీపీ పోరాటం ఉధృతం చేసిందన్నారు. అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. వంగా గీత మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఉపాధ్యాయుల ఎంపికల్లో అవినీతికి, అక్రమాలకు పాల్పడిందన్నారు. నిజమైన అర్హులకు అన్యాయం చేసిందన్నారు.

కాకినాడ సిటీ: వైఎస్సార్‌ సీపీ నగర కార్యాలయం వద్ద రిలే నిరహార దీక్ష శిబిరం చేపట్టారు. తొలిరోజు దీక్ష చేసిన వారికి సాయంత్రం ద్వారంపూడి చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ ద్వారంపూడి వీరభద్రారెడ్డి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. యువజన విభాగం జాయింట్‌ సెక్రటరీ కిషోర్‌, కుడా మాజీ చైర్మన్‌ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, మాజీ కార్పొరేటర్లు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

డీఎస్సీలో పెద్దఎత్తున అక్రమాలు

కాకినాడ రూరల్‌: డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతున్నామని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ ఉత్తరాంధ్ర రీజినల్‌ కోఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు తెలిపారు. సర్పవరం జంక్షన్‌ వద్ద రిలే దీక్షల శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. పార్టీ శ్రేణులు, విద్యార్థులకు ఆయన పూలమాలలు వేసి దీక్షలో కూర్చోబెట్టారు. కన్నబాబు మాట్లాడుతూ డీఎస్సీలో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయన్నారు. క్రీడా కోటాలో 421 పోస్టులకు సంబంధించి అడ్డగోలుగా నియామకాలు చేపట్టారని, వీరిపై తమ నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు నాలుగు రోజుల పాటు రిలే దీక్షల అనంతరం ర్యాలీ ద్వారా నిరసనలు తెలియజేస్తామన్నారు. అయినా ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement