అవకతవకలపై విచారణకు కమిటీ | - | Sakshi
Sakshi News home page

అవకతవకలపై విచారణకు కమిటీ

Aug 7 2026 12:14 AM | Updated on Aug 7 2026 12:14 AM

పెద్దాపురం: కట్టమూరు గ్రామంలో కేశవ పట్టాభిరామస్వామి దేవస్థానంలో చోటుచేసుకున్న అవకతవకలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు విచారణకు కమిటీని ఏర్పాటు చేసినట్టు దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్‌ డీఎల్‌వీ రమేష్‌బాబు గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. కట్టమూరు గ్రామానికి చెందిన ఎం.సూర్యనారాయణ మరికొందరు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేయడంతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. అసిస్టెంట్‌ కమిషనర్‌ వి.పల్లంరాజు చైర్మన్‌గా, దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్లు ఆర్‌.బాలాజీ, ఎస్‌టీపీటీ శ్రీనివాస్‌ సభ్యులుగా నియమిస్తూ సమగ్ర విచారణ నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు.

యువకుడి మృతదేహం

లభ్యం

జగ్గంపేట: భావవరం గ్రామంలోని ఏలేరు నదిలో స్నానానికి దిగి గల్లంతైన వడ్డి ప్రశాంత్‌ కుమార్‌ మృతదేహాన్ని పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో వెలికి తీయించారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగిస్తామని జగ్గంపేట ఎస్సై రఘునాథరావు తెలిపారు. ఈ ఘటనతో విహార యాత్రకు వచ్చిన విద్యార్థులు విషాదంలో మునిగిపోయారు. మృతుడి తండ్రి కొద్దికాలం కిందట మరణించగా, అతని తల్లి ఉపాధి నిమిత్తం దుబాయిలో ఉన్నారు. ప్రస్తుతం అతను అమ్మమ్మ దగ్గర ఉంటూ ఓ ప్రైవేట్‌ కళాశాలలో డిప్లమో చేస్తున్నాడు.

రొయ్యల హేచరీల్లో పరిశీలన

కాకినాడ రూరల్‌: జిల్లాలోని తొండంగి, యూ.కొత్తపల్లి మండలాల్లో హేచరీలను రాష్ట్ర మత్స్య సాంకేతిక సంస్థ (ఎస్‌ఐఎఫ్‌టీ)లోని జాతీయ జలచర జంతు వ్యాధుల నిఘా కార్యక్రమం (ఎన్‌ఎస్‌పీఏఏడీ) బృందం గురువారం పరిశీలించింది. రొయ్యల హేచరీల్లో వ్యాధి నిఘా నమూనాలను సేకరించింది. ఎస్‌ఐఎఫ్‌టీ ప్రిన్సిపాల్‌, మత్స్యశాఖ అదనపు సంచాలకులు డాక్టర్‌ అంజలి ఆదేశాల మేరకు సప్తగిరి, కేపీఆర్‌, ఎస్‌ఎస్‌ఆర్‌ హేచరీలతో పాటు పలు హేచరీలను బృందం సభ్యులు చైతన్య, శివరామకృష్ణ సందర్శించి నమూనాలు సేకరించారు. హేచరీల్లో వ్యాధులను ముందస్తుగా గుర్తించడం, నాణ్యమైన రొయ్య పిల్లల ఉత్పత్తిని ప్రోత్సహించడం, బయో సెక్యూరిటీ ప్రమాణాలను బలోపేతం చేయడం తదితర అంశాలపై నిర్వాహకులు, సిబ్బందికి అవగాహన కల్పించారు. పర్యటనకు ఎఫ్‌డీఓ ఉమామహేశ్వరరావు సహకారం అందించారు.

పంట కాలువలో పడి

కౌలురైతు మృతి

కాజులూరు: పంట కాలువలో పడి ఓ కౌలురైతు మృతి చెందాడు. స్థానికులు, గొల్లపాలెం పోలీసుల కథనం ప్రకారం.. కోలంకకు చెందిన బండారు శ్రీనివాస్‌ (37) అదే గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద కొంత పొలం కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నాడు. బుధవారం సాయంత్రం పొలానికి వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి బయటకు వెళ్లాడు. రాత్రి 10 గంటలు దాటినా తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు గ్రామంలోని పలుచోట్ల వెతికినా ఆచూకీ దొరకలేదు. చివరకు రాత్రి సమయంలో పొలానికి వెళ్లి క్షుణంగా పరిశీలించగా, శ్రీనివాస్‌ పొలాల మద్య ఉన్న పంట కాలువలో విగతజీవిగా పడి ఉన్నాడు. అప్పటికే అతను మృతి చెందినట్టు స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న గొల్లపాలెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. మృతుడు శ్రీనివాస్‌కు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కును కోల్పోవటంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. గొల్లపాలెం ఇన్‌చార్జ్‌ ఎస్సై ఆర్‌వీఎస్‌ మూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కారు, లారీ ఢీ

శంఖవరం: కత్తిపూడి జాతీయ రహదారి ఫ్లై ఓవర్‌పై గురువారం లారీ, కారు ఢీకొట్టుకున్నాయి. స్థానికుల కథనం మేరకు.. రాజమంద్రవరం నుంచి వస్తున్న కారు, వైజాగ్‌ నుంచి వస్తున్న లారీ అదుపుతప్పి ఢీకొట్టుకున్నాయి. దీంతో కారు డివైడర్‌ను ఢీకొని ఆగింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు గాయాలు తప్ప ఎటువంటి ప్రమాదం జరగనట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులను వివరాలు అడగగా, ఎటువంటి సమాచారం లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement