● ఖరీఫ్ సాగుకు నీటి ఎద్దడి
● నారుమళ్లకూ నీరు లేని పరిస్థితి
● కనిపించని అధికారులు, నాయకులు
● అన్నదాతల ఆవేదన
పిఠాపురం: ఖరీఫ్ సీజన్ వస్తుందంటే నీటి సరఫరాకు ముందుగానే ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. పొలాలు ఎండకుండా, అన్నదాతలు కంటతడి పెట్టకుండా చూసుకోవాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ప్రతి ఎకరాకు సాగునీరందుతుందని, నారుమళ్లు వేసుకోవాలని హడావుడిగా నాయకులు ప్రకటనలు ఇచ్చేసి వెళ్లిపోయారు. ఆ మాటలను నమ్మి నారుమళ్లు వేసుకున్న రైతులు ఇప్పుడు నీరందక అవస్థలు పడుతున్నారు. ఏలేరు, పీబీసీ శివారు ఆయకట్టు ప్రాంతాలైన పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి, తుని, తొండంగి మండలాల్లో వేలాది ఎకరాల పంట పొలాలు బీడు భూములుగా దర్శనమిస్తున్నాయి. కనుచూపు మేరలో ఎక్కడా నాట్లు కనిపించని పరిస్థితి నెలకొంది. నీరు లేక పంటలు ఆగిపోయాయని గగ్గోలు పెడుతున్నా పిఠాపురం నియోజకవర్గంలో పట్టించుకునే నాథుడే లేడు.
నారుమళ్లకూ నీరు లేక..
ఏలేరు ప్రాజెక్టులో నీరు డెడ్ స్టోరేజ్‌కి చేరుకోక పోయినా ప్రస్తుతం ఏలేరు ఆయకట్టుకు నీటి ఎద్దడి ఏర్పడింది. కనీసం నారుమళ్లు వేసుకునేందుకు కూడా నీరు లేక ఖరీఫ్ సాగు నిలిచిపోయింది. సాధారణంగా ఏలేరు ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ ఆరు టీఎంసీలు కాగా ప్రస్తుతం 8 టీఎంసీలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో ఆరు టీఎంసీల డెడ్ స్టోరేజ్ ఉన్న సమయంలో కూడా నీటి ఎద్దడిని నివారించడానికి కేవలం 2 టీఎంసీలు మాత్రమే ప్రాజెక్టులో ఉంచి మిగిలిన నీటిని విడుదల చేసేవారు. ఇప్పుడు 8 టీఎంసీలు ఉన్నా పంటలకు నీరు అందించని పరిస్థితి ఏర్పడడంపై రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏటా ఈ సమయానికి నాట్లు పూర్తయి కలుపు తీసే పనులు నిర్వహించేవారు. ఇప్పుడు ఎక్కడా ఒక్క నారుమడి కూడా సిద్ధం కాలేదు. ఏలేరు నుంచి నీటిని విడుదల చేశామని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నప్పటికీ, చుక్క నీరు కూడా పిఠాపురం ఆయకట్టుకు చేరలేదు.
సుమారు 62 వేల ఎకరాలు
పిఠాపురం, తుని నియోజకవర్గాల పరిధిలో సుమారు 62 వేల ఎకరాల ఆయకట్టుకు ఏలేరు, పీబీసీ ద్వారా సాగునీరు అందించాలి. కానీ ఇప్పటి వరకు ఆ రెండింటి నుంచి నీరు రాక ఖరీఫ్ సాగు ఆలస్యమైంది. ప్రస్తుతం ఏలేరుకు, పీబీసీకి నీరు వదిలినట్టు చెబుతున్నా ఎక్కడా నీరు వచ్చిన జాడ లేదని రైతులు చెబుతున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇలాకాలోనే సాగునీటి ఎద్దడితో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదు. కోట్ల రూపాయలతో క్లోజర్ పనులు చేసినట్టు కూటమి పార్టీల నాయకులు చెబుతున్నప్పటికీ ఏ కాలువలో చూసినా ఎక్కడి పూడిక అక్కడే దర్శనమిస్తోంది. ప్రస్తుతం ఏలేరు, పీబీసీ కాలువల్లో వర్షపు నీరు కూడా అడుగంటిపోయి పశువులకు కూడా తాగునీటి ఎద్దడి నెలకొంది.


