రైతులకు నీరివ్వకుంటే ఎలా! | - | Sakshi
Sakshi News home page

రైతులకు నీరివ్వకుంటే ఎలా!

Jul 26 2026 12:15 AM | Updated on Jul 26 2026 12:15 AM

పిఠాపురం: నారు పోసుకోవాలని రైతులకు చెప్పి, ఇప్పుడు నీరు ఇవ్వకుంటే ఎలా అని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్సార్‌ సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి వంగా గీతా విశ్వనాథ్‌ నిలదీశారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు శివారు మల్లవరం రోడ్డులోని కొత్త కాలువను శనివారం ఆమె పరిశీలించారు. అడుగంటిన కొత్త కాలువలోకి దిగి రైతులతో కలిసి గంట పాటు నిరసన తెలిపారు. రైతులు తమ ఆవేదనను వంగా గీతకు విన్నవించారు. తక్షణం బీబీసీ, ఏలేరు ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని, నారుమడులకు నీరు ఇవ్వాలని నినాదాలు చేశారు. పంటలకు నీరు కూడా ఇవ్వలేని ప్రభుత్వం గద్దె దిగాలని ఆగ్రహించారు. అనంతరం వంగా గీతకు వినతి పత్రం అందజేశారు.

ప్రభుత్వ యంత్రాంగం విఫలం

వంగా గీత మాట్లాడుతూ రైతులకు నీరు అందించడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఇప్పటికే కలెక్టర్‌ను రెండుసార్లు కలిసి పిఠాపురం నియోజకవర్గ రైతులకు పీబీసీ, ఏలేరు నీటిని విడుదల చేయాలని కోరామన్నారు. ఇరిగేషన్‌, వ్యవసాయశాఖ అధికారులకు ఎప్పటికప్పుడు సమస్యను వివరించినట్టు తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగంలో మార్పు లేదన్నారు. ఒకవైపు వ్యవసాయ అధికారులు నెల రోజుల నుంచి నారుమడులు వేయాలని ప్రచారం చేశారని, ఇప్పుడు నాడుమడులు వేసిన తర్వాత ఇరిగేషన్‌ అధికారులు నీరు లేదని చెప్పడం హాస్యాస్పదమన్నారు.

రైతులంటే చులకనా..

రైతులంటే ప్రభుత్వానికి చులకనగా ఉందని, రైతులు కన్నెర్ర చేస్తే ప్రభుత్వాలు కూలిపోతాయని వంగా గీత గుర్తు చేశారు. నారుమడులకు నీరు లేదని, కాలువలు ఎండిపోవడంతో పశువులు దాహార్తితో అలమటిస్తున్నాయన్నారు. ఏలేరులో నీటిని ఏ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తున్నారో స్పష్టత ఇవ్వాలన్నారు. రైతులకు నష్టం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని, వారితో కలిసి చలో ఏలేరు కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వెంటనే స్పందించాలని, రైతాంగానికి సాగునీరు విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో గొల్లప్రోలు జెడ్పీటీసీ వులవకాయల నాగలోవరాజు, పార్టీ మండల అధ్యక్షుడు అరిగెల రామయ్య దొర, నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు గొల్లపల్లి నానాజీ, పిఠాపురం పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు, నియోజకవర్గం బూత్‌ కన్వీనర్‌ కొత్తెం దత్తుడు, ఏకే మల్లవరం మాజీ సర్పంచ్‌ అరిగెల మణిబాబు, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర నాయకులు కడిమి శెట్టి కుమార భాస్కరరెడ్డి, ములికే సత్యనారాయణ, ఓరుగంటి చక్రి, చేబ్రోలు, ఏకే మల్లవరం అధ్యక్షుడు పుప్పాల బాబులు, శ్రీహరి, ఎంపీటీసీ తుమ్మలపల్లి ఈశ్వరరావు, కందా బాబ్జీ, విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఏడిది నరేష్‌, బీసీ సెల్‌ అధ్యక్షుడు నూజివీడు సూర్య, సోషల్‌ మీడియా అధ్యక్షుడు ఓరుగంటి సత్యనూకరాజు, ప్రచార కమిటీ అధ్యక్షుడు ఓరుగంటి ప్రసాద్‌, మండల బూత్‌ కమిటీ అధ్యక్షులు ఓరుగంటి కృష్ణార్జున తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వాన్ని ప్రశ్నించిన

వైఎస్సార్‌ సీపీ కో ఆర్డినేటర్‌ వంగా గీత

అన్నదాతలతో ఆటలాడితే

ఊరుకునేది లేదు

ఖరీఫ్‌కు సాగు నీరు ఇవ్వాల్సిందే

రైతులతో కలిసి నిరసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement