కొండంత భారం | - | Sakshi
Sakshi News home page

కొండంత భారం

Jul 26 2026 12:15 AM | Updated on Jul 26 2026 12:15 AM

అన్నవరం: వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి కొండపై షాపుల లీజుదారులు దేవస్థానానికి సుమారు రూ.4 కోట్ల వరకూ టెండర్‌ పెట్టారు. వివిధ షాపులను టెండర్‌ కం బహిరంగ వేలం ద్వారా లీజుకు తీసుకున్న వీరి నుంచి అద్దెలు వసూలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యాపారులు దుకాణం సర్దేసి జారుకున్నాక ఇప్పుడు అధికారులు చెక్‌ బౌన్స్‌ కేసులు వేస్తున్నారు. వ్యాపారం గడువు ముగిసి దుకాణం సర్దేసి వెళ్లిపోయిన వ్యాపారులు దాదాపు రూ.2 కోట్లు, ప్రస్తుతం నిర్వహిస్తున్న వ్యాపారులు మరో రూ.2 కోట్ల వరకూ బకాయిలు ఉన్నట్టు తెలుస్తోంది.

లీజుల ద్వారా రూ.10 కోట్లు

రత్నగిరిపై పూజాద్రవ్యాలు, ఫ్యాన్సీ, శీతల పానీయాలు, ఆవునేతి దీపాల విక్రయం, సెల్‌ ఫోన్లు, చెప్పులు, సామగ్రి భద్రపర్చడం, టోల్‌ వసూలు, వ్రతాల్లో భక్తుల ఫొటోలు తీయడం వంటి వ్యాపారాల నిర్వహణకు దేవస్థానం రెండేళ్లకోసారి టెండర్‌ కం బహిరంగ వేలం నిర్వహిస్తుంది. హెచ్చు వేలం పాట లేదా టెండర్‌ వేసిన వ్యాపారికి వీటిని లీజుకు ఇస్తారు. మొదటి ఏడాది లీజుకు ఇచ్చిన మొత్తం మీద రెండో ఏడాది 10 శాతం పెంపుదల ఉంటుంది. ఈ మొత్తానికి జీఎస్‌టీ అదనం. ఈ వేలం ద్వారా ఏటా దేవస్థానానికి సుమారు రూ.10 కోట్ల ఆదాయం లభిస్తుంది.

నిబంధనల ప్రకారం..

వేలం దక్కించుకున్న వ్యాపారి ఆరు నెలల లీజు మొత్తాన్ని అడ్వాన్స్‌గా చెల్లించి వ్యాపారం ప్రారంభించాలి. ఆ తర్వాత నుంచి ప్రతి నెలా సొమ్ము కట్టాలి. చివరి ఆరు నెలలకు ముందు కట్టిన అడ్వాన్స్‌ నుంచి మినహాయిస్తారు. అయితే, రెండేళ్లుగా ఈ లీజులు సక్రమంగా వసూలు చేయకపోవడం, ఆరు నెలల అడ్వాన్స్‌కు బదులుగా మూడు నెలలు మాత్రమే కట్టించుకుని షాపులను అప్పగించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. వ్యాపారులు సీజన్‌లో వ్యాపారం నిర్వహించి, అనంతరం నష్టాలు వచ్చాయని చేతులు ఎత్తేశారు.

వసూలుకు చర్యలు

వ్యాపారస్తుల నుంచి బకాయిల వసూలుకు చర్యలు తీసుకుంటున్నాం. గతంలో రూ.7 కోట్లు ఉండే బకాయిలను సగానికి పైగా వసూలు చేశాం. మిగిలిన వాటి కోసం ఇద్దరు గుమస్తాలను నియమించాం. బకాయిలు పెట్టి వెళ్లిపోయిన వ్యాపారులు, బౌన్స్‌ అయిన చెక్కుల విషయంలో కూడా కేసులు వేస్తున్నాం. ఇకపై షాపుల లీజుకు సంబంధించి ఆరు నెలల సొమ్ము డిపాజిట్‌ చేస్తే తప్ప షాపులు అప్పగించే ప్రసక్తి లేదు.

– నల్లం సూర్యచక్రధరరావు,

ఈఓ, అన్నవరం దేవస్థానం

అన్నవరం దేవస్థానానికి వ్యాపారుల షాక్‌

రూ.4 కోట్ల వరకూ లీజు పెండింగ్‌

వసూలు చేయడంలో అధికారుల నిర్లక్ష్యం

వ్యాపారం చేసుకుని

సర్దేసుకుంటున్న లీజుదారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement