దేవరపల్లి: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగస్టు 5న తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో పర్యటిస్తారని మాజీ హోం మంత్రి, గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత శనివారం తెలిపారు. దేవరపల్లిలోని పొగాకు వేలం కేంద్రాన్ని ఆయన సందర్శించి, వేలం ప్రక్రియను పరిశీలిస్తారని వెల్లడించారు. అనంతరం పొగాకు రైతులతో ముఖాముఖి చర్చించి వారి సమస్యలు తెలుసుకుంటారని చెప్పారు.
దూర విద్యలో
డిగ్రీ ప్రవేశాలకు ఆహ్వానం
బాలాజీ చెరువు (కాకినాడ సిటీ): ఆంధ్రా యూనివర్సిటీ దూర విద్య డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కో ఆర్డినేటర్ డాక్టర్ నాగేశ్వరరావు శనివారం తెలిపారు. డిగ్రీ, పీజీ, ఎంబీఏ విభాగాల్లో 30 రకాల కోర్సులకు నోటిఫికేషన్ జారీ అయ్యిందన్నారు. ఇతర వివరాలకు పీఆర్ డిగ్రీ కళాశాలలోని ఏయూ దూరవిద్యాకేంద్రాన్ని, లేదా 98484 05370 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
అక్టోబర్‌లో సీఐఐ భాగస్వామ్య సదస్సు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జేఎన్‌టీయూకే వేదికగా ఈ ఏడాది అక్టోబర్ 9 నుంచి 14 వరకూ ఐదు రోజుల పాటు 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఆర్వో తిప్పేనాయక్ తెలిపారు. కలెక్టరేట్‌లో శనివారం వివిధ పైవ్‌స్టార్ హోటళ్ల ప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సదస్సుకు సీఎం చంద్రబాబుతో పాటు మరో 300 మంది పారిశ్రామికవేత్తలు, ఐఏఎస్ స్థాయి అధికారులు హాజరుకానున్న నేపథ్యంలో ఫైవ్ స్టార్ హోటళ్లలో 60కి పైగా వీఐపీ ప్రత్యేక రూమ్‌లు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వీఐపీలు, వీవీఐపీలు కల్పించాల్సిన సౌకర్యాలపై హోటళ్ల ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. ఏడాది నవంబర్‌లో విశాఖపట్నంలో జరిగే ఫైనల్ సదస్సుకు ముందు ప్రిలిమినరీగా ఈ ప్రాంతీయ సదస్సును కాకినాడలో నిర్వహిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో సదస్సు నిర్వహించే జేఎన్‌టీయూకేలో వేదికను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు.
ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఆటో
కరప: ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఘటనలో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. కరప గ్రామంలోని అగ్నికుల క్షత్రియుల వీధికి చెందిన వాడ్రేవు నూకరాజు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆటోలో ప్రయాణికులను ఎక్కించుకుని శనివారం కాకినాడ వెళ్లి తిరిగి వస్తున్నాడు. కరప పంచాయతీ కార్యాలయం వద్దకు వచ్చే సరికి రామచంద్రపురం వైపు నుంచి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆటో ముందుభాగం నుజ్జవ్వగా, డ్రైవర్ సీటులో నూకరాజు ఇరుక్కుపోయాడు. స్థానికులు స్పందించి రక్త గాయాలతో ఉన్న నూకరాజును ఆటో నుంచి బయటకు తీసి, 108లో చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న కరప పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, వివరాలు సేకరించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.


