మట్టి తవ్వకాలపై కన్నెర్ర
·˘ పాపిడిదొడ్డి చెరువులో
అడ్డుకున్న ఎఫ్‌కే పాలెం రైతులు
·˘ ఇరు వర్గాల మధ్య
ఘర్షణ, తోపులాట
పిఠాపురం: ఎఫ్‌కే పాలెం పాపిడిదొడ్డి చెరువులో అక్రమంగా మట్టి తవ్వుతున్నారంటూ రైతులు శనివారం కన్నెర్ర చేశారు. మట్టి తవ్వడానికి తీసుకువచ్చిన యంత్రాలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులకు, మట్టి మాఫియాకు మధ్య తీవ్ర స్థాయిలో తోపులాటలు, వాదోపవాదాలు జరగడంతో సుమారు రెండు గంటల పాటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంతో సంబంధం లేని ఇటుక బట్టీల వ్యాపారులు దాడికి ప్రయత్నించడంతో స్థానిక రైతులు కొందరు కింద పడిపోయారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితం కావడంతో రైతులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మట్టి వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా కనీసంగా కూడా నోరు మెదపడం లేదని, మట్టి అక్రమార్కులకు వత్తాసు పలకడమేమిటని ప్రశ్నించారు. అయితే, మట్టి తవ్వకాలకు అనుమతులున్నాయని, అడ్డుకుంటే కేసులు నమోదు చేస్తామని పోలీసులు పరోక్షంగా హెచ్చరించారు. మట్టి అక్రమ తవ్వకాలను అడ్డుకుని తీరుతామని రైతులు స్పష్టం చేశారు. మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్న చెరువును సీపీఎం జిల్లా సీనియర్ నాయకుడు డి.శేషుబాబ్జీ, స్థానిక నాయకులు కుంచె చిన్న, కోనేటి రాజు శనివారం పరిశీలించారు. రైతులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. మరోవైపు పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (పాడా) పీడీ చైత్రవర్షిణి, కాకినాడ ఆర్‌డీఓ మల్లిబాబు, సీఐ శ్రీనివాస్, తహసీల్దార్ గోపాలకృష్ణ ఇరు వర్గాలతో చర్చలు జరిపారు.


