నారాయణపేట: వర్షాకాలం ముగింపు దశకు చేరుకున్నా ఉమ్మడి పాలమూరు జిల్లాను వర్షాభావ పరిస్థితులు వీడటం లేదు. వానాకాలం ముగియడానికి వారం రోజులే ఉండటంతో.. రైతుల్లో ఆందోళన నెలకొంది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 23 వరకు నమోదైన వర్షపాత గణాంకాలను పరిశీలిస్తే నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో 35 శాతం, జోగుళాంబ గద్వాలలో 42 శాతం, మహబూబ్‌నగర్‌లో 29 శాతం, నాగర్‌కర్నూల్‌లో 32 శాతం లోటు నమోదైంది.
మండలాల వారీగా పరిశీలిస్తే..
నారాయణపేట జిల్లాలోని 11 మండలాల్లో జూన్ 1 నుంచి సెప్టెంబర్ 23 వరకు జిల్లా సగటు సాధారణ వర్షపాతం 469.5 మి.మీ. కాగా.. ఇప్పటి వరకు 306.6 మి.మీ. మాత్రమే నమోదైంది. మద్దూర్, కోస్గి మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. అధిక వర్షపాతం నమోదైన మండలం ఒక్కటీ లేకపోవడం గమనార్హం. మండలాల వారీగా పరిశీలిస్తే నర్వలో అత్యధికంగా 47 శాతం, ఊట్కూర్, మాగనూర్, మక్తల్‌లో 42 శాతం చొప్పున లోటు ఉంది. మరికల్‌లో 42, ధన్వాడలో 41, నారాయణపేటలో 38, దామరగిద్దలో 37, కృష్ణాలో 35, గుండుమాల్‌లో 29, కొత్తపల్లిలో 31 శాతం లోటు నమోదైంది. మద్దూర్ మండలంలో సాధారణ వర్షపాతం 421.2 మి.మీ.గాను 377.7 మి.మీ. నమోదై 10 శాతం లోటుతో సాధారణ స్థితిలో ఉంది. కోస్గిలో సాధారణ వర్షపాతం 519.2 మి.మీ.కుగాను 452.7 మి.మీ. నమోదై 13 శాతం లోటుతోనూ సాధారణ వర్షపాతం కేటగిరీలో ఉంది. వర్షాకాలం ముగింపు దశకు చేరుతున్నా జిల్లాలో 35 శాతం వర్షపాతం లోటు కొనసాగుతుండటంతో వర్షాధార పంటలపై ఆందోళన నెలకొంది.
నాగర్‌కర్నూల్ జిల్లాలో..
నాగర్‌కర్నూల్ జిల్లాలో సాధారణ వర్షపాతం 444 మి.మీ.కాగా.. ఇప్పటివరకు 301.6 మి.మీ. మాత్రమే నమోదైంది. మండలాల వారీగా పరిశీలిస్తే పదరలో 60 శాతం, పెంట్లవెల్లిలో 56 శాతం, అమ్రాబాద్‌లో 53 శాతం, లింగాలలో 51 శాతం, పెద్దకొత్తపల్లిలో 51 శాతం లోటు నమోదైంది. మరోవైపు కొల్లాపూర్‌లో 27 శాతం, కల్వకుర్తిలో 36 శాతం, తాడూరులో 37 శాతం లోటు కొనసాగుతోంది. కోడేర్‌లో 14 శాతం, నాగర్‌కర్నూల్‌లో 16 శాతం, చారకొండలో 16 శాతం, వంగూర్‌లో 11 శాతం లోటు ఉండటంతో ఆయా మండలాలు సాధారణ వర్షపాతానికి దగ్గరగా ఉన్నాయి. ఉప్పునుంతలలో కేవలం 5 శాతం లోటు మాత్రమే నమోదైంది.
వనపర్తి జిల్లాలో..
వనపర్తి జిల్లాలో సాధారణ వర్షపాతం 474.3 మి.మీ. కాగా.. ఇప్పటి వరకు 306.4 మి.మీ. మాత్రమే నమోదైంది. బుధవారం జిల్లావ్యాప్తంగా సగటున 6.3 మి.మీ. వర్షం కురిసింది. దీంతో ఒక్కరోజు వర్షపాతం సాధారణం కంటే 125 శాతం అధికంగా నమోదైంది. అయినప్పటికీ గతంలో ఉన్న లోటు పూడ్చలేకపోయింది. ఆత్మకూర్‌లో అత్యధికంగా 64 శాతం, అమరచింతలో 53 శాతం, పాన్‌గల్‌లో 52 శాతం, చిన్నంబావిలో 46 శాతం, వనపర్తిలో 36 శాతం, ఏదులలో 35 శాతం లోటు వర్షపాతం నమోదైంది. రేవల్లి మండలంలో మాత్రమే ఇప్పటి వరకు 463.4 మి.మీ. వర్షపాతం నమోదై సాధారణ వర్షపాతం 452.5 మి.మీ.తో పోలిస్తే 2 శాతం అధికంగా ఉంది.
మహబూబ్‌నగర్ జిల్లాలో..
మహబూబ్‌నగర్ జిల్లాలోని 17 మండలాల్లో 11 మండలాల్లో లోటు వర్షపాతం, ఒక మండలంలో తీవ్ర లోటు నమోదుకాగా.. ఐదు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. జిల్లా సాధారణ వర్షపాతం 487.7 మి.మీ. కాగా.. ఇప్పటి వరకు 345.5 మి.మీ. మాత్రమే నమోదైంది. బుధవారం జిల్లాలో 3.9 మి.మీ. వర్షపాతం నమోదైంది. చిన్నచింతకుంట మండలంలో అత్యంత దారుణ పరిస్థితి నెలకొంది. సాధారణంగా 433.8 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కేవలం 171.1 మి.మీ. మాత్రమే కురిసింది. 61 శాతం లోటు నమోదై ‘లార్జ్ డెఫిషియెంట్’గా నమోదైంది. మహబూబ్‌నగర్ రూరల్‌లో 52 శాతం, అడ్డాకులలో 51 శాతం, మహబూబ్‌నగర్ అర్బనన్‌లో 49 శాతం, కౌకుంట్ల, ముసాపేటలో 43 శాతం, భూత్పూర్‌లో40 శాతం, కోయిల్‌కొండలో 37 శాతం లోటు నమోదైంది. గండీడ్, నవాబ్‌పేట, బాలానగర్, జడ్చర్ల, మహ్మదాబాద్ మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. గండీడ్, నవాబ్‌పేటలో సాధారణానికి 2 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది.
జోగుళాంబ గద్వాల జిల్లాలో..
జోగుళాంబ గద్వాల జిల్లాలో సాధారణ వర్షపాతం 421.6 మి.మీ. కాగా.. ఇప్పటి వరకు 244.1 మి.మీ. మాత్రమే నమోదైంది. వడ్డేపల్లిలో అత్యధికంగా 71 శాతం, ఉండవెల్లిలో 56 శాతం, మానవపాడులో 58 శాతం, గద్వాలలో 50 శాతం, మల్దకల్‌లో 50 శాతం, ఎరవ్రల్లిలో 59 శాతం, రాజోలిలో 46 శాతం, ఇటిక్యాలలో 41 శాతం, ధరూరులో 37 శాతం, అయిజలో 30 శాతం లోటు నమోదైంది. కేటీదొడ్డిలో 3 శాతం, గట్టులో 3 శాతం అధిక వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం పరిధిలో ఉన్న ఈ రెండు మండలాలు జిల్లా సగటుతో పోలిస్తే మెరుగైన పరిస్థితిలో ఉన్నాయి.
తుదిదశకు చేరుకున్న వానాకాలం
ఉమ్మడి జిల్లాను వీడని వర్షాభావం
చెరువులు వెలవెల.. భూగర్భ జలం తగ్గుముఖం
వాడుముఖం పట్టిన పంటలు.. ఆందోళనలో అన్నదాతలు


