● రబీలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలి
గద్వాల న్యూటౌన్: జూరాల ప్రాజెక్ట్ నుంచి నవంబర్ వరకు వారాబందీ పద్ధతిలో ప్రతి మూడు రోజులకు ఒకసారి నీటిని విడుదల చేస్తామని నీటిపారుదల శాఖ డీఈ శివకృష్ణ తెలిపారు. కలెక్టరేట్‌లోని జిల్లా వ్యవసాయశాఖ అధికారి చాంబర్‌లో శుక్రవారం రబీ సీజన్ కార్యాచరణ ప్రణాళికపై జిల్లా వ్యవసాయాధికారి వీరప్ప ఆధ్వర్యంలో నిర్వహించిన సాంకేతిక సమావేశానికి టీఆర్‌వీకే గద్వాల సమన్వయకర్త డాక్టర్ అర్చన, నీటి పారుదలశాఖ డీఈ శివకృష్ణ, డీహెచ్‌ఎస్‌ఓ రాజ్‌కుమార్, కేవీకే మదానాపురం ప్రోగాం కోఆర్డినేటర్ రాజేందర్‌రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో రబీ సీజన్‌కు సంబంధించి మండలాల వారీగా పంటల అంచనా విస్తీర్ణాన్ని ఖరారు చేయడంతోపాటు జూరాల ప్రాజెక్ట్ నుంచి సాగునీరు అందుబాటులో లేని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికపై చర్చించారు. అనంతరం నీటి లభ్యతపై స్పష్టమైన సమాచారం లేనందున, నీటి లభ్యత లేని ప్రాంతాల్లో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని అధికారులు సూచించారు. నీటి లభ్యత, నేల, వాతావరణ పరిస్థితులు పరిగణలోకి తీసుకొని మండలాల వారీగా ప్రత్యామ్నాయ పంటలను గుర్తించారు. ముఖ్యంగా మినుములు, శనగలు, మొక్కజొన్న, జొన్న పంటల విస్తీర్ణం పెంచేలా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక రూపొందించారు. దీంతోపాటు ఆత్మ నిర్భర కార్యక్రమం అమలు, పప్పుదినుసుల సాగు ప్రోత్సాహం, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల అవలంబన, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా రబీ పంట ప్రణాళికపై చర్చించారు.


