తుంగభద్రకు వరదొచ్చింది! | - | Sakshi
Sakshi News home page

తుంగభద్రకు వరదొచ్చింది!

Sep 26 2026 1:02 AM | Updated on Sep 26 2026 1:02 AM

రాజోళి: తడారుతున్న గొంతుకు చల్లటి నీరు అందినట్లు.. ఎండిపోతున్న పంటలకు తుంగభద్ర నదికి వచ్చిన వరద ఊరటనిచ్చింది. ఇటు ఆర్డీఎస్‌ ఆయ కట్టుతోపాటు అటు తుంగభద్ర నది తీర గ్రామాల్లో సాగు చేయగా.. నీరు లేక ఎండిపోతున్న పంటలకు జీవం పోస్తుందని రైతులు అంటున్నారు. తీర గ్రామాల్లో నది నీటిని నమ్ముకుని వేసిన విత్తనాలు ఎండిపోగా.. నాట్లు వేసిన చోట నీటి కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. నదిలో గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద మోటార్లను ఏర్పాటు చేసి నీటిని తరలించుకుని పంటలకు తడులు అందించేందుకు ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ కూడా నదిలో నుంచి నీరు అందలేదు. దీంతో రైతులు తమ పంటలకు నీరు అందక చాలా వరకు పంటలను నష్టపోయారు. ప్రతి ఏడాది ఈ సమయానికే పచ్చని పంటలు ఉండే గ్రామాల్లో ఎండిన పంటలు, నీటి కోసం నోరు తెరుచుకున్న భూములే కనిపిస్తున్నాయని రైతులు వాపోతున్నారు. ఈ ఏడాది వర్షాకాలంలో మొదటిసారిగా తుంగభద్ర నదికి ఎగువ నుంచి వరద రావడం కొంత ఊరట కలిగించిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పరివాహకంలో కురిసిన వర్షాలతో..

అలంపూర్‌ నిమోజకవర్గంలోని ఇటు ఆర్డీఎస్‌ కెనాల్‌ పరిధితోపాటు తుంగభద్ర నది పరివాహక గ్రామాల్లో ఎండుతున్న పంటలకు ఈ నీటితో శాశ్వత ప్రయోజనం కలగదు. కానీ, పూర్తి చివరి దశకు చేరుకుని ఎండుతున్న పంటలకు ఈ నీటితో తడులు అందించి ఊపిరి పోయవచ్చని రైతులు అంటున్నారు. తమ గోడును అధికారులు, ప్రభుత్వం వినకపోయినా దేవుడే కరుణించి.. నీటిని పంపాడని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎగువన ఉన్న టీబీ డ్యాం నుంచి దిగువకు నీరు అధికారికంగా విడుదల చేయకపోయినా.. ఆర్డీఎస్‌ ఆయకట్టు, నది పరివాహక గ్రామాల్లో సాగు చేస్తున్న పంటలకు కనీసం తడులు అందించే విధంగా నదిలో వరద రావడం సంతోషంగా ఉందని పేర్కొంటున్నారు. సుంకేసుల డ్యాం నుంచి ఎగువన ఉన్న టీబీ డ్యాం మధ్యలో కురిసిన వర్షాల కారణంగా ఈ నీరు వస్తుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వరద నీరే శుక్రవారం నాటికి రాజోలి డైవర్షన్‌ స్కీం దగ్గర తుంగభద్ర నదికి 17,100 క్యూసెక్కులు వస్తుండగా.. ఆర్డీఎస్‌ కెనాల్‌కు 565 క్యూసెక్కులు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా శుక్రవారం సాయంత్రానికి జిల్లాలోని ఆర్డీఎస్‌ ఆయకట్టు ప్రారంభమయ్యే సిందనూర్‌ దగ్గర నీరు రాగా.. అధికారులు అక్కడికి చేరుకొని కెనాల్‌ వెంట పర్యవేక్షణ చేసి నీటి ప్రవాహానికి అడ్డంకులు తొలగించారు.

ఈ ఏడాది మొదటిసారి నదిలో ప్రవాహం

సుంకేసుల– టీబీ డ్యాం మధ్యలో

కురిసిన వర్షాలతో పారుతున్న నీరు

నదికి 17,100.. ఆర్డీఎస్‌కు 565 క్యూసెక్కులు రాక

నెర్రెలిచ్చిన భూములు.. ఎండుతున్న పంటలకు జీవకళ

ఆయకట్టు, నది పరివాహక

గ్రామాల్లో రైతుల హర్షం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement