గద్వాల: జిల్లాలో భూ సంబంధ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ అన్నారు. భూముల రీ సర్వే, భూ భారతి, సాదాబైనామా తదితర రెవెన్యూ అంశాలపై శుక్రవారం తహసీల్దార్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ అంశాలపై సమీక్షించడానికి ఈ నెల 28న వనపర్తిలో జరిగే ఉమ్మడి జిల్లాస్థాయి సమావేశానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరవుతారని, ఈ నేపథ్యంలో జిల్లాకు సంబంధించి సమగ్ర రెవెన్యూ సమాచారంతో హాజరు కావాలన్నారు. భూభారతి, సాదాబైనామా తదితర దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా పరిష్కరించాలన్నారు. రీసర్వే పనులు వేగవంతంగా చేయాలని లైసెన్స్ సర్వేయర్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు తొమ్మిది గ్రామాల్లో రీ సర్వే ప్రారంభించగా రెండు గ్రామాల్లో మాత్రమే పూర్తయిందని మిగిలిన చోట్ల పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, ఏడీ నూకరాజు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
జాతీయ స్థాయిలో జిల్లా ఖ్యాతి
ఉత్తమ నీటి నిర్వహణపై ఢిల్లీలో తనకు ప్రసగించే అవకాశం లభించడంతో జాతీయస్థాయిలో జోగుళాంబ జిల్లా ఖ్యాతి ఇనుమడించిందని కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ అన్నారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్‌లో ఈ నెల 24న కలెక్టర్ పాల్గొని వచ్చిన నేపథ్యంలో శుక్రవారం జిల్లా అధికారులు కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను ఘనంగా సన్మానించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నీటి వనరులను సరంక్షించేందుకు ప్రణాళిక రూపొందించడమే కాకుండా వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసినప్పుడే అనుకున్న ఫలితాలు వస్తాయన్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తున్నందున ఉన్ననీటి వనరులను కాపాడుకునేందుకు ప్రజల భాగస్వామ్యంతో చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మధుమోహన్, నర్సింగ్‌రావు, డీపీఓ శ్రీకాంత్, పరిశ్రమల శాఖ అధికారి రామలింగేశ్వర్‌గౌడ్, సీఈఓ నాగేంద్రం తదితరులు పాల్గొన్నారు.


