ధరూరు: తూకాల్లో మోసాలు చేస్తే సహించేది లేదని జిల్లా తూనికలు, కొలత శాఖాధికారి అశోక్‌రావు అన్నారు. సోమవారం ఆయన స్థానికంగా పలు దుకాణాలను తనిఖీ చేసి.. మోసపూరితంగా వినియోగిస్తున్న కాంటాలను వాడుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపారులు కాంటాలను వాడటంలో తప్పు లేదని, కానీ మోసపూరితంగా వాడి జనాలను నిలువు దోపిడి చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఏటా తమ తూకాల రాళ్లకు ముద్రలు వేయించుకోవాలన్నారు. ముఖ్యంగా ఏళ్ల తరబడిగా తూకాలకు సీల్ లేకుండా వినియోగిస్తున్న వారిపై కేసులు నమోదు చేశామన్నారు. మండల వ్యాప్తంగా ఒక్క రోజులోనే 8 మంది వ్యాపారులపై కేసులు నమోదు చేశామన్నారు.
ఉత్సాహంగా క్రీడా పోటీలు
గద్వాల న్యూటౌన్: జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 8 గంటల నుంచి వివిధ క్రీడా విభాగాల్లో ఎంపికల కోసం బాలురు, బాలికలకు జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. అండర్–14కు ట్రయాథ్లాన్ (ఏ, బీ, సీ) విభాగాల్లో, అండర్–16కు 100, 200, 400, 600 మీటర్ల లాంగ్ జంప్, షాట్‌పుట్, హైజంప్, జావెలిన్‌త్రో, అండర్–18, 20కు 100, 200, 400, 800, 1500 మీటర్ల హైజంప్, లాంగ్‌జంప్, షాట్‌పుట్, జావెలిన్‌త్రో విభాగాల్లో పోటీలు నిర్వహించగా.. 450 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో ఆయా విబాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 40 మంది క్రీడాకారులను ఎంపిక చేశారు. వీరిని ఈ నెల 26, 27 తేదీల్లో వరంగల్‌లో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు పంపనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు బీసన్న, కార్యదర్శి సతీష్‌కుమార్ తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో ప్రతిభకనబర్చి జిల్లాకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఆంజనేయులు, కోశాధికారి అశోక్, పీఈటీలు ప్రవీణ, రాధ, ధర్మతేజ తదితరులు పాల్గొన్నారు.
నేడు సదరం క్యాంపు
గద్వాల: జిల్లాలోని మానసిక దివ్యాంగులకు మంగళవారం సదరం క్యాంపు నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు సోమవా రం ప్రకటనలో తెలిపారు. జిల్లాకేంద్రంలోని రెండో రైల్వేగేటు వద్ద ఉన్న జిల్లా మహిళా సమాఖ్య భవనం వద్ద నిర్వహించే శిబిరానికి దివ్యాంగులు హాజరుకావాలని సూచించారు.
252 క్వింటాళ్ల
వేరుశనగ రాక
గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు సోమవారం 252 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. కాగా.. క్వింటాల్ గరిష్టంగా రూ.7,499, కనిష్టంగా రూ.4,529, సరాసరిగా రూ.7,219 ధరలు లభించాయి. అలాగే 19 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. క్వింటాల్ గరిష్టంగా రూ.7,059, కనిష్టంగా రూ.6,989, సరాసరిగా రూ.7,019 ధర పలికింది.


