అయిజ: వైద్య విద్యార్థిని ప్రియాంక మృతికి కారకులైన నిందితులకు కఠిన శిక్ష విధించాలని వైఎస్సార్‌సీపీ నేత, రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ అన్నారు. గురువారం ఆయన ప్రియాంక స్వగ్రామం ఎక్లాస్‌పూర్ చేరుకొని ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. ప్రియాంక తల్లి చంద్రమ్మ, తండ్రి వెంకటేష్‌లను ఓదార్చారు. ఈ సందర్భంగా మార్గాని భరత్ మాట్లాడుతూ సంఘటన జరిగిన రోజే నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెబుతున్నా కానీ, దుర్ఘటన జరిగిన మూడురోజుల వరకు నిందితులు ఎక్కడ దాక్కు న్నారని ఏపీ పోలీసులను ప్రశ్నించారు. మూడురోజులపాటు ఎన్ని సూట్‌కేసులు ఎంతమంది చేతులు మారాయని, ఇవన్నీ తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేస్తే అసలు విషయాలు బయటకు వస్తాయన్నారు. రిటైర్డ్ జడ్జి, సీనియర్ ఐపీఎస్‌తో కూడిన త్రీమెన్ కమిటీని ఏర్పాటు చేయాలని, అప్పుడే కేసుపై విచారణ పారదర్శకంగా జరుగుతుందని పేర్కొన్నారు. నిందితులకు నార్కోటిక్ టెస్ట్ చేయించాలన్నారు. సంఘటన జరిగిన వెంటనే అక్కడి డీఎస్పీ సినిమాకు వెళ్లారని, ఈ కేసు గురించి అడిగితే చిన్న ఘటన అని చెప్పడంపై మండిపడ్డారు. ప్రియాంకకు జరిగిన అన్యాయం గురించి తాను మాట్లాడిన మాటలన్నింటిని మెటాఫికి కంప్లెంట్ పెట్టి డిలీట్ చేస్తున్నారని ఆరోపించారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పినప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయని, ఏపీ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్‌ను కంట్రోల్‌లో పెట్టాలని, ప్రియాంకకు జరిగిన అన్యాయం మరే అమ్మాయికి జరగకుండా చూడాలని కోరారు. నిందితులను కాపాడే వారెవరో తెలుసుకొని వారికి కూడా శిక్ష విధిస్తే ప్రియాంక లాంటి మరెంతో మంది అమ్మాయిలను కాపాడవచ్చని అభిప్రాయపడ్డారు. రాజమండ్రిలో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతుందని ఆరోపించారు. వీధికో బెల్ట్ షాప్ ఉందని, ప్రతి వైన్స్ పక్కన ఒక పర్మిట్ రూం ఏర్పాటు చేసి ఏపీ ప్రభుత్వమే మద్యం తాగేవారిని ప్రోత్సహిస్తుందని దుయ్యబట్టారు.
అస్వస్థతకు గురైన ప్రియాంక తల్లి
మార్గాని భరత్ విలేకరులతో మాట్లాడుతుండగా అక్కడే నిలబడిన ప్రియాంక తల్లి స్పృహతప్పి అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రి యాంక మృతిచెందినప్పటి నుంచి ఆమె ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, రోజురోజుకూ ఆమె ఆరో గ్యం క్షీణిస్తుందని భర్త వెంకటేష్ వాపోయారు.
వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్


