గద్వాల: పంద్రాగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ మధుమోహన్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగే స్వాతంత్య్ర వేడుకలకు చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయా శాఖల వారీగా అధికారులకు సూచనలు ఇచ్చారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అట్టహాసంగా వేడుకలు జరిగేలా ఆయా శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ముఖ్య అతిథులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఆహ్వానితులందరిని ఆహ్వానించాలని చెప్పారు. వేడుకలకు హాజరయ్యే అందరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలన్నారు. పతాకావిష్కరణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పోలీస్‌పరేడ్ గ్రౌండ్‌లో వేదిక సీటింగ్ ఏర్పాట్లను పక్కాగా చేపట్టాలని, తాగునీరు, ఇతర వైద్యసదుపాయం కల్పించాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, ఆర్డీఓ శ్రీనివాసరావు, ఏఓ మంజుల, తహసీల్దార్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.


