నిబంధనలు బేఖాతరు! | - | Sakshi
Sakshi News home page

నిబంధనలు బేఖాతరు!

Aug 13 2026 1:15 AM | Updated on Aug 13 2026 1:15 AM

గద్వాల వ్యవసాయం: నర్సరీలు ఏర్పాటుచేసుకొని ఉద్యాన మొక్కలతో వ్యాపారం నిర్వహించే వారు తప్పనిసరిగా నర్సరీ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్‌ చేయించాలి. ఇందుకోసం మూడేళ్ల క్రితం ఉద్యానశాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో కొన్ని రోజుల క్రితం మరోసారి నర్సరీ నిర్వాహకులకు నోటీసులు అందించి.. 30 రోజుల గడువు ఇచ్చారు. అయితే నర్సరీలన్నింటికీ రిజిస్ట్రేషన్‌ అయి.. నర్సరీ చట్టం అమలయ్యేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

జిల్లాలో ఉద్యాన సాగుపై మక్కువ..

జిల్లాలో ఉద్యాన పంటలకు నేలలు అనుకూలంగా ఉన్నాయి. వాతావరణం సైతం సాధారణంగానే ఉంటుంది. దీంతో ఇక్కడ సాధారణ పంటలతో పాటు కూరగాయలను ఏటా విస్తారంగా పండిస్తారు. రెండు సీజన్‌లతో కలిపి దాదాపు 10వేల ఎకరాల్లో రైతులు వివిధ రకాల కూరగాయలు సాగు చేస్తారు. వంకాయ, బెండ, పచ్చిమిర్చి, చిక్కుడు, క్యాలీఫ్లవర్‌, క్యాబేజీ, టమాటా, బీర, సోరకాయ, కాకర, ఉల్లితో పాటు ఆకుకూరలు సైతం పండిస్తారు. మామిడి, బత్తాయి, జామ, డ్రాగన్‌, నిమ్మ తదితర పండ్ల తోటలు సాగులో ఉన్నాయి. వీటితో పాటు బంతి, మల్లె, కనకాంబరం తదితర పూల తోటలు ఉన్నాయి.

అనుమతులు లేకుంటే అంతే..

చట్టంలో చెప్పిన విధంగా నర్సరీల నిర్వహణ ఉండాలి. కొనుగోలు చేసిన రైతుకు తప్పక రశీదు ఇవ్వాలి. తద్వారా పంట రాని సమయాల్లో సదరు రైతులకు పరిహారం లభిస్తుంది. లేదంటే ఎలాంటి ఆధారాలు లేక అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. ప్రైవేటు నర్సరీల నుంచి కొనుగోలు చేసిన మొక్కలు, నారు నుంచి పంటలు ఆశించిన స్థాయిలో రాక రైతులు నష్టపోయిన ఘటనలు ఉన్నాయి. జిల్లాలో 37కు పైగా అనుమతులు లేని నర్సరీలు ఉండగా.. అందులో చాలా వరకు చట్టం సూచించిన విధంగా లేనట్లు తెలుస్తోంది. ఈ విషయంలో రైతులు సైతం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

మరోసారి నోటీసులు..

నర్సరీలను రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని 2023లో ఉద్యానశాఖ అధికారులు నోటీసులు అందించారు. అయితే ఏ ఒక్క నర్సరీ కూడా రిజిస్ట్రేషన్‌ కాలేదు. కొద్ది రోజుల క్రితం అధికారులు మరోసారి నోటీసు లు అందించారు. ఈసారైనా రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటారా లేదా అనే అనుమానాలు ఉన్నాయి. నో టీసులకు స్పందించని నిర్వాహకులపై అధికారులు చర్యలు తీసుకుంటేనే రైతులకు ప్రయోజనం కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ప్రైవేటు నర్సరీల్లోనే విక్రయం..

అన్ని రకాల కూరగాయలు, పూలు, పండ్లకు సంబంధించిన మొక్కలు, నారును ప్రైవేటు నర్సరీల్లోనే విక్రయిస్తుంటారు. అయితే నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ.. నిబంధనలకు అనుగుణంగా నర్సరీలను నిర్వహించేలా ఉద్యాన నర్సరీ రిజిస్ట్రీకరణ, క్రమబద్ధీకరణ చట్టాన్ని 2010లో ప్రభుత్వం తీసుకొచ్చింది. చట్టం ప్రకారం సరైన నాణ్యతా ప్రమాణాలతో పండ్లు, కూరగాయలు, పూల మొక్కల ఉత్పత్తి ఉండాలి. మొక్కల పరిమాణం, ప్రమాణాల మేరకు ధర నిర్ణయించబడాలి. పండ్ల మొక్కల ఉత్పత్తి కోసం నాణ్యత గల తల్లి చెట్టు రకాలను కలిగి ఉండాలి. కూరగాయల నారును షెడ్‌ నెట్‌లలో చీడపీడలు లేకుండా పెంచాలి. అయితే చట్టంలో సూచించిన ప్రకారం అన్ని ప్రమాణాలను పాటిస్తూ.. నిర్వాహకులు రిజిస్ట్రేషన్‌ కోసం ఫొటో, నర్సరీ పూర్తి చిరునామా, భూమి పట్టాదారు పాస్‌పుస్తకం లేదా లీజ్‌ అగ్రిమెంట్‌, లేఅవుట్‌ మ్యాప్‌, నర్సరీలో ఉన్న వసతులు, భూసార, నీటి నాణ్యత పరీక్షలు, చివరి మూడేళ్ల నర్సరీ మొక్కల ఉత్పత్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి. ఇలా వచ్చిన దరఖాస్తులను ఉద్యానశాఖ అధికారులు స్వీకరించి.. నర్సరీలో ఉన్న వసతులు, నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి రిజిస్ట్రేషన్‌ చేసి, నిర్వహణకు అనుమతి ఇస్తారు.

జిల్లాలో ఇష్టానుసారంగానర్సరీల నిర్వహణ

అనుమతులు లేకుండానే ఉద్యాన మొక్కల విక్రయాలు

అధికారులు నోటీసులు

జారీ చేసినా స్పందన కరువు

రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని

మరోసారి నోటీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement