వనపర్తి: ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది తక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయి.. ఉమ్మడి పాలమూరు రైతులు ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకొని నష్టపోకుండా ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి సూచించారు. బుధవారం వనపర్తి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్ ఆదర్శ్ సురభి అధ్యక్షతన జరిగిన సాగునీటి సలహా మండలి సమావేశానికి వారితో పాటు ఎమ్మెల్యేలు, నీటిపారుదల, వ్యవసాయ శాఖ అఽధికారులు హాజరయ్యారు. ఎల్‌నినో కార ణంగా కరువు పరిస్థితులు, ఉమ్మడి జిల్లా పరిధిలో ని జూరాల, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, ఆర్డీఎస్, కేఎల్‌ఐ, భీమా తదితర ప్రాజెక్టుల్లో ప్రస్తుత నీటిమట్టం, రాబోయే రోజుల్లో సాగు, తాగు అవసరాల దృష్ట్యా నీటి నిల్వలపై సుదీర్ఘంగా చర్చించారు. ఎగువన వర్షాలు కురవడంతో కర్ణాటకలో ని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి వచ్చిన వరదతో ప్రస్తుతానికి ప్రాజెక్టులు నింపుకొన్నామని.. ప్రస్తుతం ఆయా ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల నిలిచినట్లు నీటిపారుదలశాఖ అధికారులు వివరించారు. రాబోయే రోజుల్లో తిరిగి నీటి విడుదల జరిగితేనే రైతులకు సాగునీరు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. సాగునీటి విడుదలకు సంబంధించి సాధ్యాసాధ్యాలపై రైతులకు అవగాహన కల్పించి ఆరుతడి పంటలు సాగు చేసేలా సూచనలు చేయాలని నిర్ణయించా రు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. అదృష్టవశాత్తు కర్ణాటకలో కురిసిన కొద్దిపాటి వర్షాలతో జూరాలకు వరద వచ్చిందని.. వరి సాగు చేస్తే డిసెంబర్ వరకు నీరు అవసరం ఉంటుందన్నారు. అప్పటి వరకు ఇవ్వాలంటే వర్షాలు కురవడం తప్పనిసరని.. ఎల్‌నినో ప్రభా వంతో రానున్న రెండు, మూడునెలలు ఆశించిన మేర వర్షాలు కురిసే అవకాశాలు లేవని తెలిపా రు. రూ.వేల పెట్టుబడితో వరిసాగు చేసి నష్టపోవడం కంటే ఆరుతడి పంటలు సాగు చేయడమే రైతుకు శ్రేయస్కరమన్నారు. ప్రస్తుత ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రైతులు ఆరుతడి పంటలు వేసుకునేలా పూర్తిస్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఎగువ నుంచి నీటి ప్రవాహం వచ్చినప్పుడు సరిపడా సాగునీరు అందించడానికి చర్య లు తీసుకోవాలని, లేకుంటే వారబంధి విధానంలో నీళ్లు వదలాలన్నారు. జిల్లాలోని జలాశయాల కు ఎంత నీరు వస్తోంది.. ఎంత వదులుతున్నామ నే విషయాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు రాజేష్‌రెడ్డి, విజయు డు, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట, గద్వాల, నాగర్‌కర్నూల్ కలెక్టర్లు ఖుష్బూగుప్తా, సీహెచ్ ప్రియాంక, షేక్ రిజ్వాన్‌బాషా, హేమంత కేశవ్ పాటిల్, వ్యవసాయ, నీటిపారుదల శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లా ఐఏబీ సమావేశంలోమంత్రులు జూపల్లి, వాకిటి
నీటి విడుదల, పంటల సాగుపైసుదీర్ఘంగా చర్చ
పాల్గొన్న ఎమ్మెల్యేలు, సాగునీటి, వ్యవసాయశాఖ అధికారులు


