గద్వాల: జిల్లాలో ప్రభుత్వ ధాన్యం పరులపాలవుతోంది. రైస్‌మిల్లర్లు ప్రభుత్వం నుంచి తీసుకున్న ధాన్యానికి సీఎమ్మార్ అందించాల్సి ఉండగా.. పెద్దఎత్తున దోపిడీకి తెరలేపారు. ఐదేళ్ల కాలంలోనే సుమారు రూ. 60కోట్ల విలువైన ధాన్యాన్ని మా యం చేశారు. 2022–23, 2023–24, 2024–25 సంవత్సరాల్లో వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి 20కి పైగా మిల్లులు కనీసం 20శాతం కూడ సీఎమ్మార్ బియ్యం పెట్టలేదంటే మిల్లర్లు ఎంతమేర ప్రభుత్వ ధాన్యాన్ని దోచుకుంటున్నారో స్పష్టమవుతోంది. ఇదిలా ఉంటే, హత్యకేసులో నిందితుడిగా ఉన్న ఓ మిల్లర్ కేటీదొడ్డి మండలంలోని ఎఫ్‌సీఐ గోదాంలో నిల్వచేసిన ధాన్యంలో సుమారు రూ. 30కోట్ల విలువచేసే ధాన్యాన్ని అక్రమంగా కర్ణాటకలో విక్రయించినట్లు తెలిసింది. ఇటీవల ఎఫ్‌సీఐ అధికారుల తనిఖీలో ఈ విషయం వెలుగుచూడగా.. ప్రతినెలా రిపోర్టు ఇవ్వాల్సిన సివిల్ సప్లయ్‌శాఖ అధికారులు ఇదేమీ పట్టనట్లు ధాన్యం బస్తాలు గోదాంలోనే నిల్వ ఉన్నట్లు తప్పుడు నివేదిక ఇవ్వడం హాట్‌టాపిక్‌గా మారింది.
ఐదేళ్లలో రూ.కోట్ల ధాన్యం పక్కదారి..
ఐదేళ్ల కాలంలో ప్రభుత్వం సేకరించిన వరిధాన్యా న్ని జిల్లాలోని రైస్‌మిల్లర్లకు కేటాయింపులు చేయగా.. ఇందులో సుమారు 70వేల మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించిన సీఎమ్మార్ ఇంకా ప్రభుత్వానికి అందలేదు. ఇందులో 2022–23 సంవత్సరానికి సంబంధించి కేటాయించిన 36,814 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 34 రైస్‌మిల్లర్లకు కేటాయిస్తే.. వాటిలో కేవలం 11శాతం మాత్రమే సీఎమ్మార్ అందించారు. మిగిలిన 23,503 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి సీఎమ్మార్ రావాల్సి ఉంది. అదే విధంగా 2024–25 యాసంగిలో 1,01,924 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 39 రైస్‌మిల్లర్లకు కేటాయించగా.. 88 శాతం సీఎమ్మార్ పెట్టారు. తాజాగా 2025–26 యాసంగికి సంబంధించి 1,72,432 మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయించగా.. ఇంకా 38,377 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించిన సీఎమ్మార్ పెట్టాల్సి ఉంది. అయితే ప్రభుత్వం వద్ద తీసుకున్న ధాన్యం నిల్వలు మిల్లులో ఉండాల్సి ఉండగా.. అక్రమ మార్గంలో బయటకు తరలించి రూ.కోట్లలో సొమ్ము చేసుకున్నట్లు తెలిసింది.
ఆలస్యంగా గుర్తింపు..
కేటీదొడ్డి మండలంలో రూ. 30కోట్ల ధాన్యం మాయమైనట్లు ఆలస్యంగా గుర్తించిన జిల్లా ఉన్నతాధికారులు.. సంబంధిత అధికారులకు తీవ్రస్థాయిలో చీవాట్టు పెట్టినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి ఓ ఉన్నతాధికారికి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. అదే విధంగా జిల్లాలో సివిల్ సప్లయ్‌శాఖలో కీలకంగా పనిచేస్తున్న ఇద్దరు అధికారులపై శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించినట్లు తెలిసింది. అదే విధంగా అక్రమాలకు పాల్పడిన సదరు రైస్‌మిల్లర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసి, క్రిమినల్ కేసు నమోదుతో పాటు ఆర్‌ఆర్ యాక్ట్ కింద రికవరీ చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.
ఎఫ్‌సీఐ అధికారుల తనిఖీలో వెలుగు..
ప్రభుత్వం నుంచి తీసుకున్న ధాన్యం నిల్వలు సరిగ్గా ఉన్నాయో లేదా అనే విషయంపై ఇటీవల ఎఫ్‌సీఐ అధికారులు జిల్లా సివిల్ సప్లయ్‌శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా తనిఖీలు చేపట్టారు. అయితే కేటీదొడ్డి మండలంలో ఓ రైస్‌మిల్లుకు సంబంధించిన గోదాంలో ఏకంగా సుమారు రూ. 30కోట్ల విలువైన ధాన్యం బస్తాలు మాయమైనట్లు గుర్తించారు. ఇదే విషయాన్ని జిల్లా సివిల్ సప్లయ్‌శాఖ అధికారులతో విచారణ చేయగా.. సరైన సమాధానం ఇవ్వకుండా దాటవేసినట్లు తెలిసింది. విషయం బయటకు పొక్కితే ఉద్యోగ భద్రతకు ముప్పు ఏర్పడుతుందని బతిమిలాడి జాగ్రత పడినట్లు తెలుస్తోంది.
తాజాగా రూ. 30కోట్ల విలువైన వరిధాన్యం మాయం
ఎఫ్‌సీఐ అధికారుల తనిఖీలో బహిర్గతం
సదరు మిల్లర్‌కు అధికారుల వత్తాసు
చర్యలకు ఉపక్రమించిన ఉన్నతాధికారులు
జిల్లాలో ఐదేళ్లుగా సాగుతున్న మిల్లర్ల దోపిడీ


